Share News

వైసీపీ వీరాభిమాని.. రిమ్స్‌ సూపరింటెండెంట్‌పై విచారణ

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:29 AM

వైసీపీ వీరాభిమాని, కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఇనచార్జి సూపరింటెండెంట్‌, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈయన ఎన్నో ఏళ్లుగా రిమ్స్‌లో పాతుకుపోయి తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే

వైసీపీ వీరాభిమాని..  రిమ్స్‌ సూపరింటెండెంట్‌పై విచారణ
డాక్టర్‌ సురేశ్వర్‌రెడ్డి

జగన ప్రభుత్వంలో వైసీపీకి సలాం

ఎన్నికల్లోనూ అదే ధోరణి

ఎమ్మెల్సీ ఫిర్యాదుతో విచారణకు ప్రభుత్వం ఆదేశం

కడప, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ వీరాభిమాని, కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఇనచార్జి సూపరింటెండెంట్‌, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈయన ఎన్నో ఏళ్లుగా రిమ్స్‌లో పాతుకుపోయి తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈయన సొంతూరు చెన్నూరు మండలం. ఈయన తండ్రి నవనీశ్వర్‌రెడ్డి టీటీడీ బోర్డుమెంబరుగా పనిచేశారు. సర్వజన ఆసుపత్రి ఆవిర్భవించిన తరువాత సురేశ్వర్‌రెడ్డి అక్కడ హవా కొనసాగించారు. వైఎస్‌ ఉన్నంత వరకు వీళ్ల ఫ్యామిలీ కాంగ్రెస్‌లో ఉండేది. జగన పార్టీ ఏర్పాటు తరువాత వైీసీపీలో ఉన్నారంటారు. కాంగ్రెస్‌ అయినా వైసీపీ అయినా రిమ్స్‌లో ఈయనదే డామినేషన. వివేకా హత్య కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న కొందరు నిందితులు అనారోగ్యం పేరుతో ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అప్పట్లో ఇక్కడ ట్రీట్‌మెంటుపై పెద్ద విమర్శలు వచ్చాయి. సరిగ్గా ఎన్నికల ముందు సురేశ్వర్‌రెడ్డి మరింతగా బరితెగించారు. టీడీపీ వాళ్లతో మాట్లాడవద్దు, వైసీపీకి ఓటు వేయండి, టీడీపీకి వేయవద్దు అంటూ ఆయన నేరుగా వైద్యశాల సిబ్బందికి ఫోన్లు చేసి బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు వికలాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికెట్లను వైసీపీ సిఫారసుల మేరకు అనర్హులకు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన వ్యవహారంపై ఆధారాలతో సహా ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ఆగస్టు 1న ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వైసీపీకి ఓటు వేయాలంటూ ఆయన చేసిన ప్రచారం వాయిస్‌ రికార్డులతో సహా ప్రభుత్వానికి చేరవేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సురేశ్వర్‌రెడ్డిపై విచారణకు ఆదేశించింది.

Updated Date - Sep 19 , 2024 | 12:29 AM