అధికారం.. అంతమవగానే..
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:48 PM
మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 11గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయ వచ్చిన జగన.. రోడ్డు మార్గాన ఇడుపులపాయ నుంచి వేంపల్లె మీదుగా పులివెందులకు చేరుకున్నారు. వేంపల్లెలో నూతనంగా వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించారు, మరో ఇద్దరు నాయకులతో మాట్లాడారు.
నెలలో రెండుమూడు సార్లు సొంతూరికి జగన
ఇళ్లకు వెళ్లి పలకరింపులు, ఆశీర్వాదాలు
పులివెందులలోనే బస, ప్రజాదర్బార్
ఆశ్చర్యపోతున్న పులివెందుల ప్రజలు
ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు... పదవి కోల్పోయి అధికారంలో లేనప్పుడు జగనలో ఎంతో స్పష్టమైన మార్పు కనిపస్తోంది. జగన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో సొంతూరు పులివెందులలో ఏనాడూ బసచేయలేదని చెప్పాలి. అలాగే ప్రజాదర్బార్ కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ఏడాదికి మూడుసార్లు.. అదీ వైఎస్ జయంతి, వర్దంతి, క్రిస్మస్‌కు రావడం మినహా పులివెందులకు ప్రత్యేకంగా వచ్చి ప్రజలతో మమేకమైన పరిస్థితులు లేవు. అలాగే బంధువుల ఇళ్లకు గాని, నాయకుల ఇళ్లకు గాని వెళ్లి ఆశీర్వాదాలు, పలుకరింపులు లేవు. ఇప్పుడు మాత్రం పనిగట్టుకుని జగన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెలలో రెండుమూడు సార్లు పులివెందులకు వస్తున్నారు.
కడప, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 11గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయ వచ్చిన జగన.. రోడ్డు మార్గాన ఇడుపులపాయ నుంచి వేంపల్లె మీదుగా పులివెందులకు చేరుకున్నారు. వేంపల్లెలో నూతనంగా వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించారు, మరో ఇద్దరు నాయకులతో మాట్లాడారు. అక్కడి నుంచి పులివెందులకు 3గంటలకు వచ్చారు. అప్పటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజలనుంచి స్పందన లేదు. ప్రజలు ఉన్నారంటే ఉన్నారనేలా ఈ కార్యక్రమం సాగింది. మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించారు. మధ్యలో బంధువుల ఇళ్లకు, నాయకుల ఇళ్లకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి, బంధువులను పలకరింపులు చేశారు. గురువారం తెల్లవారుజామున 5.40గంటల ప్రాంతంలో పులివెందులలోని బాకరాపురం ఇంటి నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుని 7.30గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు వెళ్లారు.
అధికారంలో ఉండగా అంటీముట్టనట్టు..
ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు పులివెందుల ప్రజలతో జగన అంటీముట్టనట్లు వ్యవహరించారు. కానీ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల పులివెందుల పర్యటనకు వచ్చి మూడు రోజులు గడిపేవారు. పులివెందుల పర్యటనలో భద్రతా సిబ్బందిని పక్కనపెట్టి మరీ ఆయన అందరితో కలిసిపోయేవారు. కానీ జగన మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. సామాన్యుడు జగనను కలవలేని పరిస్థితికి ఆయన వెళ్లిపోయారు. పదవి పోతూనే సామాన్యులు సైతం తనను కలవచ్చని సంకేతాలు వెళ్లేలా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు.
నాడు బంధువులను పట్టించుకోలేదు
మరోపక్క బంధువులను కూడా జగన నాడు పట్టించుకోలేదు. కానీ షర్మిలతో ఆస్తుల తగాదా జరుగుతున్న కారణంగా ఇప్పుడు బంధువులను సైతం కలిసేందుకు జగన సుముఖత చూపుతున్నారు. బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మధ్యలో ఆపేసి కడప ఎంపీ అవినాశరెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాశరెడ్డి ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. సీవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను కూడా కలవడం చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా కుటుంబ సమావేశం నిర్వహించేవారు. అందులో సీవీ సుబ్బారెడ్డి ఉండేవారు. ఏ సమస్యవచ్చినా పరిష్కార మార్గాన్ని ఆలోచించి ఒక తాటిపైకి వచ్చి పరిష్కరించుకునే వారని అక్కడి నాయకులు అంటున్నారు. వైఎస్ మృతి అనంతరం జగన అటు ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి వారిని పక్కన పెట్టేశారు. దీని కారణంగా కుటుంబంలో ఇప్పుడు ఏ సమస్య తలెత్తినా కుటుంబ సమావేశాలు జరగకపోవడంతో అవి మరింత పెద్దగా అవుతున్నాయని, వైఎస్ కుటుంబసభ్యుల్లో కొందరు గతంలో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివేకానందరెడ్డి హత్య జరగడం, సునీత సీబీఐని ఆశ్రయించే సమయంలోనే అనాదిగా వస్తున్న కుటుంబ సమావేశం నిర్వహించి ఉంటే ఈ సమస్య జఠిలమయ్యేది కాదని అక్కడి వారు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా జగన పదవి ఉన్నప్పటి కంటే పదవి లేని సమయంలోనే ప్రజలతో మమేకమవుతున్నారనడం నగ్నసత్యం. ఐదేళ్లలోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం.. కడప ఎంపీ స్థానం కూడా తక్కువ మెజారిటీతో గెలవడం చూసి ఆయనకు తత్వం బోధపడిందని అంటున్నారు. తాను ఒంటరి అయిపోతున్నాననే భయంతో జనంతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.