AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:54 PM
జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో ..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దాఖలైన ఓ ప్రయివేట్ కేసులో మాజీ సీఎం జగన్ సమీపం బంధువులు పలువురికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీచేశారు. జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ మురళి నాయక్ ఈ నోటీసులను జారీచేశారు. పది రోజుల కిందట ఇదే కేసులో కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకున్నారు.
కేసు ఏమిటంటే..
వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్సింగ్పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డిని విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇదే కేసులో ప్రస్తుతం జగన్ సమీప బంధువులతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.
ఓవైపు సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాలతో ఓవైపు సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈకేసులో పలువురు నిందితులను విచారించడవంతో పాటు కొందరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో కొందరికి బెయిల్ రాగా.. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. పలువురు నిందితులు ఈకేసులో అప్రూవర్‌గా మారారు. 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. మొదట గుండెపోటుగా ప్రచారం చేయగా, వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడిఉండటం, ఆయనపై కత్తితో దాడిచేసిన ఆనవాళ్లు ఉండటంతో గుండెపోటు కాదని, కత్తిపోటు అంటూ ప్రచారం జరిగింది. అనేక మలుపులు తిరిగిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు చేపట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈకేసు విచారణను అప్పటి ప్రభుత్వం తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని, నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని వివేకా కుమార్తె సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరకు సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించడంతో వివేకా కుమార్తె ఫిర్యాదుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here