‘స్వర్ణాంధ్ర విహారదర్శిని’కి స్కూల్ టాపర్స్
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:24 AM
పులివెందుల డివిజనపరిధిలోని పాఠశాలల్లో నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభచూపిన విద్యార్థులు స్వర్ణాంధ్ర విహారదర్శినికి శుక్రవారం బయలుదేరారు.
పులివెందుల రూరల్, అక్టోబరు 4: పులివెందుల డివిజనపరిధిలోని పాఠశాలల్లో నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభచూపిన విద్యార్థులు స్వర్ణాంధ్ర విహారదర్శినికి శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా పులివెందుల, లింగాల, సింహాద్రిపురం ఎంఈఓలు బి.రామకృష్ణయ్య, చంద్రశేఖర్, శారదలు మాట్లాడుతూ ఇటీవల జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించామన్నారు. ఇందులో పాఠశాల టాపర్‌గా నిలిచిన దాదాపు 500మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం స్వర్ణాంధ్ర విహార దర్శిని కార్యక్రమం చేపపట్టామన్నారు. 11వ తేదీ వరకు శ్రీకాళహస్తి, శ్రీహరికోట, అమరావతి, విజయవాడ, ద్రాక్షారామం, అన్నవరం, సింహాచలం, విశాఖపట్టణం, అరకు సందర్శిస్తారన్నారు. తిరుగు ప్రయాణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశతో ముఖాముఖి ఉంటుందన్నారు. పులివెందుల డివిజన నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు రెండు బస్సులలో కడపకు వెళ్లారన్నారు. శుక్రవారం స్థానిక అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత (మెయిన) పాఠశాలవద్ద ఎంఈఓలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.