Share News

ఆర్టీసీ గాడిన పడేనా..?

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:20 PM

ఆర్టీసీ ఆదాయం పెంపుదల కోసం సంస్థ ఆవిర్భావం నుంచి మూడు ప్రధాన అంశాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఫిక్స్‌డ్‌ బస్‌ ఒకటి. ప్రతీ రూట్‌కు ఒక బస్సు తిరుగుతుంటే ప్రయాణికుల మదిలో అది బస్సు అనే

ఆర్టీసీ గాడిన పడేనా..?

ఏడాదిగా ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లకు మంగళం

దీంతో ఆదాయానికి... సమయపాలనకు గండి

అయినా చోద్యం చూస్తున్న అధికారులు

కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 25: సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ పెట్టింది పేరు. ఇందులో పగలూ రాత్రి తేడా లేకుండా ఉద్యోగులు (కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్‌లు) నిరంతరం పనిచేస్తూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటారు. వీరికి సక్రమంగా విధులు కేటాయిస్తేనే సంస్థ ఆదాయం కూడా బాగుంటుంది. కానీ ఆ దిశగా మాత్రం అడుగులు పడటం లేదు.

ఆర్టీసీ ఆదాయం పెంపుదల కోసం సంస్థ ఆవిర్భావం నుంచి మూడు ప్రధాన అంశాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఫిక్స్‌డ్‌ బస్‌ ఒకటి. ప్రతీ రూట్‌కు ఒక బస్సు తిరుగుతుంటే ప్రయాణికుల మదిలో అది బస్సు అనే ముద్రపడుతుంది. దానికి ఆదరణా పెరుగుతుంది. సదరు బస్‌కు ఫిక్స్‌డ్‌ డ్రైవర్‌, ఫిక్స్‌డ్‌ కండక్టర్‌ను సైతం నియమిస్తారు. అలా ఏర్పాటు చేయడం వలన ఆయా రూట్‌లలో ఎక్కడ ప్రయాణికులు ఎక్కువగా బస్సులో ఎక్కుతారు, ఎక్కడ తక్కువ సంఖ్యలో ఉంటారు, రోడ్డుపై ఎక్కడ గుంతలున్నాయి, ఎక్కడ స్పీడ్‌ బ్రేకర్లున్నాయి... అనే విషయాలతో పాటుగా ఎవరి డ్యూటీలు వారు చేయడం వలన సమయపాలనతో పాటు సంస్థ ఆదాయం బాగా ఉండేది. పైపెచ్చు ఆయా బస్సుల మరమ్మతులు కూడా తక్కువగా వచ్చేవి.

మోకాలడ్డుతున్న యూనియన్ల పాలెగాళ్లు

కడప రీజియన పరిధిలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్‌, పులివెందుల డిపోలలో సుమారు 598 బస్సులుండగా 2,283 మంది కండక్టర్లు, డ్రైవర్లు సేవలందిస్తున్నారు. ఆయా డిపోలలో ఇదివరరకు ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు అమల్లో ఉండేవి. దీంతో వారికి కేటాయించిన డ్యూటీలలో వారు నిమగ్నమై సంస్థ ఆదాయ పెంపుదల కోసం పాటుపడేవారు. కాలగమనంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, హక్కుల సాధనకోసం వెలసిన వివిధ యూనియన (అసోసియేషన)లకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు పాలెగాళ్లుగా మారడంతో ఆయా డిపోలలో ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైతే కడప డిపోలో తూ తూ మంత్రంగా కండక్టర్ల చార్ట్‌ వేసి డ్రైవర్ల చార్ట్‌కు మంగళం పలికారు. ఇక మైదుకూరు, బద్వేల్‌ డిపోలలో యూనియన పాలెగాళ్ల హవా కారణంగా ఫిక్‌ ్సడ్‌ డ్యూటీ చార్ట్‌లు ఏడాదిగా వేయలేదు. మిగతా ప్రొద్దుటూరు. జమ్మలమడుగు, పులివెందుల డిపోలలో మాత్రం ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌ అమల్లో ఉంది. ఇప్పటికీ కడప, మైదుకూరు, బద్వేల్‌ డిపోలలో ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు వేయకపోవడం వలన బస్సుల ఫెయిల్యూర్స్‌ అధికం కావడంతో పాటు ఆయా రూట్‌లలో సరైన అవగాహన లేని డ్రైవర్లు, కండక్టర్లు వెళుతుండటంతో సంస్థకు వచ్చే ఆదాయం దెబ్బతింటోంది. ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌ వేయాలని సంస్థ నిబంధనలున్నా ఆచరణలో ఫలించడం లేదు. ఉద్యోగ సంఘాల పేరుతో చలామణి అవుతున్న కొంతమంది నేతలే కావాలని రకరకాల కారణాలతో ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు వేయనీకుండా చేస్తున్నారని ఆయా డిపోల కండక్టర్లు, డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా కొంతమంది సూపర్‌వైజర్లు కూడా ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు వేస్తే తమ హవా తగ్గిపోతుందని వేయనివ్వకుండా యూనియన నేతలతో జతకడుతున్నారనే ఆరోపణలున్నాయి.

చోద్యం చూస్తున్న అధికారులు

కడప రీజియన పరిధిలోని కడప, మైదుకూరు, బద్వేల్‌ డిపోలలో సంవత్సరానికి పైగా ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు అమలుకాలేదు. అయినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంస్థ ఆదాయ పురోగతి కోసం త్వరితగతిన ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు అమలయ్యేలా చూడాలని పలువురు డ్రైవర్లు, కండక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆర్టీసీ ఆర్‌ఎం గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. త్వరలో ఆర్టీసీలో బదిలీలున్నాయని అవి కాగానే కడప, మైదుకూరు, బద్వేలు డిపోలలో ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లను అమలు చేస్తామని చెప్పారు.

Updated Date - Sep 25 , 2024 | 11:27 PM