భావి మలబార్ విన్యాసాలపై కీలక చర్చలు
ABN , Publish Date - Oct 11 , 2024 | 05:55 AM
నాలుగు ప్రధాన దేశాలు కలిసి భవిష్యత్తులో మరోసారి నిర్వహించబోయే మలబార్ విన్యాసాల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై విశాఖలో గురువారం కీలక సమావేశం జరిగింది.
విశాఖపట్నం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నాలుగు ప్రధాన దేశాలు కలిసి భవిష్యత్తులో మరోసారి నిర్వహించబోయే మలబార్ విన్యాసాల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై విశాఖలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఇక్కడ తూర్పు నౌకాదళంలో మలబార్ ఎక్సర్‌సైజ్-2024 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ అధ్యక్షతన అమెరికా పసిఫిక్ దళం అడ్మిరల్ స్టీఫెన్ కోహ్లెర్, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ సీఎన్‌సీ వైస్ అడ్మిరల్ కట్సూషి ఒమాచి, ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ క్రిష్ స్మిత్ సమావేశమయ్యారు. నౌకాదళాలు పరస్పర సహకారం పెంపొందించుకోవడం, ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో కలిసి పనిచేయడంపై చర్చించారు.
నేవీ సిబ్బందికి ఆటవిడుపు
దేశ రక్షణ కోసం పనిచేసే నౌకాదళాల సిబ్బంది ఆటల్లో మునిగి తేలారు. మలబార్ మారీటైమ్ ఎక్సర్‌సైజ్-2024 లో భాగంగా తూర్పు నౌకాదళానికి విచ్చేసిన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ఒకరితో మరొకరు కలిసిపోయి రకరకాల ఆటలాడారు. ఐఎన్‌ఎస్ సర్కార్స్ మైదానంలో టగ్ ఆఫ్ వార్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడారు.