Share News

Madanapalle Incident: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. ఆ ఎనిమిది కేసులు ఎవరిపైనో..!?

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:52 AM

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది...

Madanapalle Incident: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. ఆ ఎనిమిది కేసులు ఎవరిపైనో..!?

అన్నమయ్య జిల్లా/మదనపల్లె టౌన్‌: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసుకు (Madanapalle Incident) అనుసంధానంగా మరో ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎనిమిది కేసులు ఏమిటి..? ఎవరి మీద నమోదు చేశారు..? అన్న ప్రశ్నలు మదనపల్లె ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 21వ తేదీ రాత్రి మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం విదితమే. దీనిపై సీఐడీ సహకారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.


madanapalli.jpg

అదే జరిగితే..?

ఈ క్రమంలో డీఐజీ ప్రవీణ్‌ మదనపల్లెలో ఇచ్చిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో ఉండకూడని పత్రాలు దొరికినట్లు, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. దీంతో పాటు 52 మందిని విచారించగా, అందులో 15 మంది అనుమానితులను విచారించి సోదాలు చేశామన్నారు. వారి వద్ద ఉండకూడని కీలకపత్రాలు స్వాధీనం చేసుకుని ఎనిమిది కేసులు నమెదు చేశామన్నారు. వాస్తవంగా ఏదైనా నేరం జరిగితే ఆ నేరం చేసిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన, సాక్ష్యాలు, ఆధారాలు చెరిపేందుకు, దాచిపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసు కాస్పరసి సెక్షన్‌ 120-బి (కూడగట్టుకుని నేరం చేసిన) కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైళ్ల దహనంపై మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 135/2024 కింద నమోదైన కేసుకు, ఈ ఎనిమిది కేసులు కూడా తోడవుతాయనే కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే 15 మంది అనుమానితుల్లో ఎవరిపై ఎనిమిది కేసులు నమోదు చేస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


madana-palli-fire.jpg

ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఏం వస్తుందో..?

సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం ఘటనపై నాగ్‌పూర్‌ నుంచి నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సు ల్యాబ్‌ నిపుణులు వచ్చి ఘటన జరిగిన ప్రాంతంలో కాలిపోయి మిగిలిన అవశేషాల శాంపిల్స్‌ తీసుకున్నట్లు సమాచారం. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించలేదని విద్యుత్‌ సేఫ్టీ అధికారులు ఎంఆర్‌ఐ (మీటర్‌ రీడింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌) డేటా విశ్లేషించి ప్రభుత్వానికి, పోలీసులకు నివేదికలు అందచేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఫైర్‌ అధికారులకు 11.47 గంటల సమయం సమాచారం అందగా ఐదు నిమిషాల్లోనే ఫైర్‌ బ్రిగేడియర్లు సబ్‌కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్దఎత్తున మంటలు వ్యాపించి కిటికీల్లో నుంచి మంటలు బయటకు వస్తుండటం ఫైర్‌ అధికారుల కంటపడింది.


Files-Madanapalle-Incident.jpg

పదిరోజుల్లో..!

దీనిని బట్టి చూస్తే కార్యాలయం అంతటా వేగంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.ఇలా జరగడానికి హైలీ ఇన్‌ఫ్లేమబుల్‌ రసాయనాలైన గ్యాసోలిన్‌, పెయింట్‌ తిన్నర్‌, టర్పెంటైన్‌, శానిటైజర్‌, పెట్రోల్‌, స్పిరిట్‌ తదితర ఏవైనా ఉపయోగించారా..? అన్నది ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో తేలనుంది. సాధారణంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు వచ్చేందుకు నెల రోజులైనా సమయం తీసుకుంటారని తెలిసింది. కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయం సీరియస్‌గా తీసుకోవడంతో వచ్చే పది రోజుల్లో ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని డీఐజీ చెప్పిన మాటల్లో తెలుస్తోంది. అదే వస్తే సాక్ష్యాధారాలతో పోలీసులు అసలు నిందితులను అరెస్టు చూపనున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:54 AM