Share News

Drone Summit: పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

ABN , Publish Date - Oct 21 , 2024 | 07:31 AM

అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు.

Drone Summit: పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

అమ‌రావ‌తి: ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బెజవాడలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల వ‌ద్ద భారీ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ (Dinesh Kumar) ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు. 10 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు ప్రత్యేక బాధ్యత‌లు అప్పగించారు. ఏర్పాట్లను డ్రోన్ కార్పొరేష‌న్ అధికారులు నిరంత‌రం ప‌ర్యవేక్షిస్తున్నారు.


కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024’ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. సదస్సు జరిగే ప్రాంతాన్ని వివిధ శాఖల కార్యదర్శులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఐఅండ్‌ఐ కార్యదర్శి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న డ్రోన్ల సమ్మిట్‌కు వివిధ శాఖల నుంచి 10 మంది ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమ్మిట్‌ ఏర్పాట్లను వివరించారు.


పలు కీలక అంశాలు..

డ్రోన్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు.

22న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్‌ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి.

సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు.

డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి.

డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటాయి.

వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలల ఏర్పాటు.

2030 నాటికి భారత్‌ను గ్లోబల్‌ డ్రోన్‌ హబ్‌గా రూపొందించడం, డ్రోన్‌ నిబంధనలపై బృంద చర్చలు.

ప్రజాభద్రత, విపత్తుల నిర్వహణ, డ్రోన్‌ సాంకేతికత అప్లికేషన్ల వినియోగం, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్ల ఆవిష్కరణలు తదితర అంశాలపైనా చర్చలు ఉంటాయి.

వ్యవసాయం, ఆరోగ్యం, లాజిస్టిక్‌ రంగాల్లో డ్రోన్ల వినియోగం, డిజిటల్‌ భూరికార్డుల రూపకల్పనలో డ్రోన్ల వినియోగంపై బృంద చర్చలు జరుగుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

షర్మిలతో రాయ‘బేరం’

దీపావళి నుంచే ఉచిత గ్యాస్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 21 , 2024 | 07:31 AM