Share News

AP Govt : ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. ధరలు పెంచిన సర్కారు

ABN , Publish Date - Dec 18 , 2024 | 03:49 AM

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు, సొసైటీలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt : ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. ధరలు పెంచిన సర్కారు

  • సంక్షేమ శాఖల కొనుగోళ్లకు వర్తింపు

  • ఏటా 10% పెంపునకు ప్రభుత్వం ఓకే

  • విద్యార్థి చొక్కాకు రూ.98.90..ప్యాంట్‌కు రూ.175.40

  • 2024-25 సంవత్సరానికి వర్తింపు

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు, సొసైటీలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరేళ్ల క్రితం(2018లో) పెంచిన ధరలు ఇప్పుడు గిట్టుబాటు కావట్లేదని ఆప్కో ఎండీ ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల దుస్తుల ధరలు పెంచింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ శాఖలు ఒక విద్యార్థి చొక్కా (91 సెం.మీ వస్త్రం) ధర రూ.67.10, ప్యాంట్‌ (137సెం.మీ వస్త్రం) రూ.143.60 చొప్పున చెల్లిస్తున్నాయి. విద్యార్థినులకు లంగా(113 సెం.మీ) ధర రూ.78.70 ఇస్తున్నాయి. ఈ ధరలు గిట్టుబాటు కావడం లేదని ఆప్కో ఎండీ చేసిన ప్రతిపాదనతో చంద్రబాబు సర్కారు విద్యార్థి చొక్కా వస్త్రం ధర రూ.98.90; ప్యాంట్‌ వస్త్రం రూ.175.40; విద్యార్థినుల లంగా ధర రూ.116.30కు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఈ ధరలు వర్తిస్తాయంటూ, ఇకపై ఏటా పది శాతం చొప్పున పెంచుకోవడానికి అనుమతిచ్చింది. చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ శాఖలు ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


చేనేత సహకార సంఘాల పెదవి విరుపు

చేనేత వస్త్రాల ధరల పెంపుపై రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు పెదవి విరుస్తున్నాయి. వస్త్రం ధర పెంపు తమ కోసం కాదని, పొరుగు రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారుల కోసమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసి, కమీషన్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి బడి పిల్లల యూనిఫామ్‌ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నూలు, ముడిసరుకు సబ్సిడీ ధరలకు అందించి.. కార్మికులకు పని కల్పిస్తుందని ఆశిస్తే అదేమీ జరగడం లేదంటున్నారు. అధికారులకు, మంత్రికి గోడు వివరించినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. కర్నూలు, కడప, రాజమండ్రి, శ్రీకాకుళం లాంటి జిల్లా షర్టింగ్‌ క్లాత్‌ అందుబాటులో ఉన్నా ఇప్పటికీ తెలంగాణలో కొనుగోలు చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సహకార సంఘాల బకాయిలు పెట్టి పొరుగు వ్యాపారులకు రూ.7 కోట్ల ఆర్డర్‌ ఇచ్చి ముందుగానే 50 శాతం అడ్వాన్స్‌ చెల్లించడం వెనుక రహస్యమేంటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలంటూ నిట్టూరుస్తున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 09:25 AM