AP High Court: ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Feb 05 , 2024 | 11:37 AM
అమరావతి: పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. ఏడేళ్ల జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది.
అమరావతి: పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. ఏడేళ్ల జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?.. అరెస్ట్ చేయనివ్వండి, అందుకు బాధ్యులైన అధికారులు పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని అధికారులను లోపలకి పంపిస్తామని, ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని వ్యాఖ్యనించింది. దీంతో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరడంతో తదుపరి విచారణ మంగళవారం నాటికి వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్ కోరుతూ పర్చూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కంపెనీల్లో ఇటీవల తనిఖీలకు వచ్చిన మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలగించారని ఆరోపిస్తూ ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే ఏలూరి హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్లో ఏం పేర్కొన్నారంటే..
‘‘గ్రానైట్ కంపెనీల్లో తనిఖీలు చేయకుండా విధులకు ఆటంకం కలిగించామనే ఆరోపణలతో మైనింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(నిఘావిభాగం, నెల్లూరు) బాలాజీనాయక్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు కంపెనీల యజమానులతో పాటు నాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా కేసు పెట్టారు. కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయి. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవే. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ)కింద నోటీసులు ఇవ్వాలి. కానీ, ఇవ్వలేదు. మరోవైపు, ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఈలోగానే నన్ను(పిటిషనర్) అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లే అయినా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వారికి రిమాండ్ విధించారు. పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తగా ఫామ్-7 దాఖలు చేసిన వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే ఓట్ల తొలగింపులో భాగస్వాములైన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కొందరు పోలీసులను సైతం సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో నన్ను వేధించాలనే ఏకైక ఉద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారు. నాపై నమోదైన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందుస్తు బెయిల్ మంజూరు చేయండి’’ అని ఎమ్మెల్యే ఏలూరి హైకోర్టును అభ్యర్థించారు.