Deputy CM: వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 17 , 2024 | 01:12 PM
వాల్మీకి జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుందని, ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు.
అమరావతి: వాల్మీకి (Valmiki) జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవలసిన ఇతిహాసం రామాయణం అని, మన వాఙ్మయంలో ఆదికావ్యంగా నిలిచిన రామాయణాన్ని (Ramayanam) సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. గురువారం వాల్మీకి జయంతి (Valmiki Jayanti) సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుందని, ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి ఋషి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు.
రామాయణ మహా కావ్యాన్ని మానవాళికి అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వేటగాడైన రత్నాకరుడు తారక మంత్రోపదేశం పొంది వాల్మీకిగా మారి రామాయణ కావ్యాన్ని రచించిన క్రమాన్ని తెలుసుకొంటే ఆధ్యాత్మిక జ్ఞానం విలువ తెలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా దైవ చింతన కలిగే ప్రతి ఒక్కరికీ, వాల్మీకిని ఆరాధించేవారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి..
కాగా యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 17న వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు అప్పట్లో భారీ సంఖ్యలో వినతులు అందాయి. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మగౌరవానికి ప్రాముఖ్యతనిస్తూ అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు యువగళం పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సజ్జలను విచారించనున్న పోలీసులు ..
తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు
తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..
రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై కేటీఆర్ కామెంట్స్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News