Share News

Rain Alert: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం..

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:31 PM

నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Meteorological Departmen) తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు (Tamilnadu) తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని వెల్లడించింది.

Rain Alert: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం..
Rains in AP and Tamilnadu

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు (Tamilnadu) తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


ఈ జిల్లాలకు అలర్ట్..

అల్పపీడన ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (మంగళవారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకట్రోండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు(బుధవారం) రోజు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఒకట్రోండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే బుధవారం నాడు కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు మూడ్రోజులపాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.


అప్రమత్తంగా ఉండండి..

కోస్తా జిల్లాల్లో వరి, ప్రత్తి, పొగాకు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరి కోతలను రెండు మూడు రోజులపాటు వాయిదా వేసుకోవాలని ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పంటను కుప్పలుగా వేసుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు వేట కోసం సముద్రం లోపలికి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య భారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న ఒడిషా, ఉత్తరాంధ్ర జిల్లాలు.. తెలంగాణకు ఆనుకుని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. ఆదివారం విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 5.6, కుంతలలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగులలో ఈ ఏడాది నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. శనివారం ఈ ప్రాంతంలో 8.9 డిగ్రీలు ఉండగా ఒక్క రోజులో 3 డిగ్రీలు తగ్గడం గమనార్హం. చలికాలం, అల్పపీడనం ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఈ వార్తలు చదవండి:

Nellore: నెల్లూరుకు మహర్దశ.. మంత్రి నారాయణ ఏం చెప్పారంటే..

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 17 , 2024 | 03:42 PM