AP News: రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు.. ఇద్దరు అధికారుల సస్పెండ్
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:44 PM
కృష్ణ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ అయింది. రైతుల ఫిర్యాదులపై గత రాత్రి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని హెచ్చరించారు. రైతుల నుండి నిరంతరంగా ధాన్యం కొనుగోలు జరగాలని ఆదేశించారు.
అమరావతి: కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో (Farmer Assurance Centers) అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ (AP Govt. Serious) అయింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు (Two Officers) కస్టోడియల్ ఆఫీసర్, టీఎలను సస్పెండ్ (Suspended) చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ..., రికార్డులలో మాత్రం తక్కువ చూపిస్తున్న వైనంపై బుధవారం మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఈ అవకతవకల ఘటనపై ఆధారాలను స్వయంగా పరిశీలించారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి..., రికార్డుల్లో మాత్రం తక్కువ చూపిస్తూ... అధికారులు - మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారంటూ రైతుల నుంచి ఆరోపణలు వచ్చాయి.
రైతులకు ఎమ్మార్వో ఫోన్
రైతుల ఫిర్యాదులపై గత రాత్రి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని హెచ్చరించారు. రైతుల నుండి నిరంతరంగా ధాన్యం కొనుగోలు జరగాలని ఆదేశించారు. పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా అవకతవకలు ఆధారాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శాఖపర చర్యలకు ఆదేశించారు. కస్టోడియల్ ఆఫీసర్, టీఎలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ చర్యలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిర్యాదు చేసిన రైతులకు ఎమ్మార్వోల నుంచి ఫోన్లు వెళ్లాయి. వ్యక్తిగతంగా కలిసి సమస్య పరీష్కరించుకోవాలంటూ కొందరు రైతులకు ఎమ్మార్వో ఫోన్ చేశారు.
రైసు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు
కాగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ అమూన్ ఆదేశాల మేరకు అధికారులు రైసు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు, లీగల్ మెట్రాలజీ, పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన 5 ప్రత్యేక బృందాలు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కృష్ణా జిల్లాలోని రైసు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాయి. ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖరీఫ్ ముగిసేవరకు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని సివిల్ సప్లయిస్ అధికారులు తెలిపారు.
12 గంటల్లో ఖాతాల్లో నగదు జమ
కాగా ‘దళారులకు ధాన్యాన్ని విక్రయించుకోవద్దు. రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోండి. మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. 12 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.’ అని రైతులకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహార్ హామీ ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాను కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన ఆయనకు మాజేరు వద్ద ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జనసేన, టీడీపీ నేతలు స్వాగతం పలికారు. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల పరిధిలోని పాతమాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, మంగళాపురం అడ్డరోడ్డు, చల్లపల్లి-పెదకళ్లేపల్లి రోడ్దు, కాసానగర్, పెదప్రోలు ప్రాంతాల్లో హైవేపై దారి పొడవునా ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులున్న ప్రతిచోటా వాహనం దిగి సమస్యలు తెలుసుకున్నారు. వర్షానికి ధాన్యం తడవడం, కొద్దిమేర మొలకెత్తటం, తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టుకుంటున్నామని, తేమశాతం ఎక్కువగా ఉండటంతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని, తీసుకున్నా తక్కువ ధర ఇస్తున్నారని రైతులు మంత్రికి తెలిపారు. 1262, 1224 రకం ధాన్యం కొనుగోలు చేయటంలేదని ఫిర్యాదు చేశారు. ప్రతి గింజా ప్రభుత్వ మద్ధతు ధరకే కొనుగోలు చేస్తామని, దళారులను ప్రోత్సహించవద్దని, సమస్యలుంటే రైతుసేవా కేంద్రానికి వెళ్లాలని రైతులకు మంత్రి సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని సాయంత్రంలోగా కొనుగోలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తేమ 24శాతం వరకూ కొనుగోలు చేయాలని ఆదేశించామన్నారు. 1262 రకం కొనుగోలుపై ఇప్పటికే మాట్లాడామని, 1224 రకం కొనుగోలులోనూ ఇబ్బందులు లేకుండా చూస్తామని, రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. మిల్లర్లు, అధికారులతో ఇబ్బందులుంటే ఆర్డీవో దృష్టికి తేవాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని 104 ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
మాజేరు వీఏఏ, టీఏలపై ఆగ్రహం
పాతమాజేరులో ఆరబెట్టిన ధాన్యం పరిశీలిస్తుండగా ఓరైతు ధాన్యం విక్రయంలో ఇబ్బందులు మంత్రికి చెప్పారు. దీంతో రైతుసేవా కేంద్రానికి వెళ్లారా అని రైతును మంత్రి ప్రశ్నించారు. తాము వెళ్లలేదని, వారు తమను అడగటం లేదని రైతు చెప్పారు. దీంతో మంత్రి స్థానిక టీఏ, వీఏఏలను ప్రశ్నించారు. వరికోతల సమాచారం రైతులు ఇవ్వలేదని టీఏ చెప్పటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్‌లో ఎందుకు తిరగటం లేదని వీఏఏపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ-క్రాప్ జరిగినప్పుడు రైతు దగ్గరకు మీరెందుకు వెళ్లటంలేదని మందలించారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డీవో స్వాతిని ఆదేశించారు. తమ తప్పేమీ లేదనీ.. రైతులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని, నేరుగా మిల్లర్లనే సంప్రదిస్తున్నారని వారు ఆర్డీవోకు విన్నవించారు.
రైతులకు గన్నీ బ్యాగులు అందించండి
ధాన్యం కొనుగోలులో సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్‌కు లంకపల్లి గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి లీలాకృష్ణ వివరించారు. స్పందించిన మంత్రి ఈ రోజు సాయంత్రానికల్లా ధాన్యాన్ని తరలించాలని, అవసరమైన గన్నీ బ్యాగులు రైతులకు అందించాలని ఆర్డీవో స్వాతిని ఆదేశించారు.
డ్రయర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి
రైతుల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో డ్రయర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అన్ని రకాల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ వెంటనే ఆన్‌లైన్ చేసి మిల్లులకు తరలించేలా చూడాలని ఆర్డీవో స్వాతికి మంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు
ప్రభుత్వ చర్యలపై లోకాయుక్త సంతృప్తి
బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News