NV Ramana: మాతృభాషపై తమిళనాడు తరహాలో చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:56 PM
Andhrapradesh: ‘‘ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ఇచ్చే ఆలోచన చేయాలి. తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుంది. మన ఆచార, వ్యవహారాలు సక్రమంగా అమలు చేయాలి. అభివృద్ధితో పాటు భాషా సంస్కృతిని అలవాటు చేసుకోవాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
విజయవాడ, డిసెంబర్ 28: 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ యన్.వి.రమణ (Justice NV Ramana) పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సాహిత్యం, వైభవం గురించి అనర్గళంగా ఇక్కడ మాట్లాడారన్నారు. తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని.. తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు. ఒక సంగీతం తరహాలో అందమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కారని విమర్శించారు. తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదన్నారు. వాడుక భాషలో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని.. తెలుగు భాష వృద్ధిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టింది లేదన్నారు.
కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని వెల్లడించారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయన్నారు. భవిష్యత్తుతరాలకు మాతృభాషపై ఒక గౌరవం కలిగించాయన్నారు. ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ‘‘పర భాషను నేర్చుకోండి... వ్యామోహం పెంచుకోకండి. నా సంస్కృతి నాశనం కాకుండా చూడాలని గాంధీజీ చెప్పేవారు. మాతృభాషలో విద్యను అభ్యసించి చాలా మంది ఉన్నత స్థితికి చేరారు. పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అనే పరిస్థితి కల్పించారు. తెలుగు భాషలోచదివి... దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో. ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ఇచ్చే ఆలోచన చేయాలి. తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుంది. మన ఆచార, వ్యవహారాలు సక్రమంగా అమలు చేయాలి. అభివృద్ధితో పాటు భాషా సంస్కృతిని అలవాటు చేసుకోవాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
ఎన్టీఆర్ వల్లే తెలుగు భాషకు గౌరం..
మాతృభాషపై మమకారం ఉన్న వారి వల్లే మన భాషకు గౌరవం దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ వంటి వారి వల్ల మన భాషకు, మన తెలుగు వాళ్లకు గౌరవం పెరిగిందన్నారు. మానవ బంధాలతో కూడిన రచనలే కలకాలం ప్రజల్లో నిలుస్తాయని.. కన్యాశుల్కం వంటి రచనలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కన్నా... సమాజాన్ని మేల్కొలిపే రచనలే మిన్న అని తెలిపారు. తెలుగు భాషను పరిపుష్టం చేయాలనే ఆలోచనపై ప్రభుత్వం సానుకులంగా స్పందించాలని కోరారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడాలని.. లేదంటే భవిష్యత్తులో తెలుగు పేపర్లు, ఛానళ్లు చూసే పరిస్థితి ఉండదన్నారు. ‘‘తమిళనాడులో అక్కడ భాషాభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని.. ఆ తరహాలో మన దగ్గర పాలకులు స్పందించడం లేదు. అక్కడ ఉన్న ఐక్యత, మన దగ్గర లేదనేది వాస్తవం. కవులు, భాషాభిమానులను చూసి ప్రభుత్వాలు భయపడవు. ప్రజలను కూడా తెలుగు భాషోద్యమంలో భాగస్వామ్యం చేయాలి. ప్రజల మద్దతుతో మన ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలుగు భాషకు మద్దతు ఇచ్చేవారికే ఓటు అని ప్రజలతో చెప్పించండి. అప్పుడే మన భాష అభివృద్ధి, వైభవం తప్పకుండా సాకారం అవుతుంది’’ అని ఎన్వీ రమణ పేర్కొన్నారు.
కూటమి సర్కార్ ఆ కేసుపై దృష్టి పెట్టాలి
కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భాష అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేసేలా ఇచ్చిన జివో 85ను రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసుపై దృష్టి పెట్టాలన్నారు. తెలుగు భాష ప్రాధికారిక సంస్థను మళ్లీ పునరుద్ధరించాలన్నారు. 2019 కి ముందు చంద్రబాబు ఏర్పాటు చేసినా.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ మహాసభల ద్వారా కవులు, రచయితలకు ప్రోత్సాహం అందించాలని.. వారికి భాషాభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించాలన్నారు. ‘‘తెలుగువారి శక్తి... తెలుగువాడి నాడి వ్యాపించాలి.. నేను కోరేది ఇంత’’ అంటూ మహాకవి శ్రీశ్రీ రచనలతో ఎన్వీ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి...
ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం
బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..
Read Latest AP News And Telugu News