Share News

Buddha Venkanna: ఆ ఘటన చంద్రబాబు గుండెల మీద తన్నేలా ఉంది

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:33 PM

Andhrapradesh: నూజివీడులో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని.. నీచంగా దూషణలు చేసి... చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అంటూ మండిపడ్డారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందన్నారు.

Buddha Venkanna: ఆ ఘటన చంద్రబాబు గుండెల మీద తన్నేలా ఉంది
TDP Leader Buddha Venkanna

విజయవాడ, డిసెంబర్ 17: ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. జోగి రమేష్‌తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని బుద్దా తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వ్యక్తులతో టీడీపీ నేతలు అంటకాగితే తామెలా పోరాటం చేయాలని ప్రశ్నించారు. అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచన వస్తోంది అంటూ బుద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Year Ender 2024: వైసీపీ నేతల అరాచకానికి పరాకాష్ట.. ఏపీలోనే సెన్సేషనల్ కేసు ఇది..


చాలా బాధ కలిగించింది...

‘‘ నాడు చంద్రబాబు ఇంటి పై దాడికి వెళ్లిన జోగి రమేష్ .. తాము అడ్డుకున్న సమయంలో జరిగిన వివాదం’’ వంటి అంశాలతో ఫోటోలను బుద్దా ప్రదర్శించారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూజివీడులో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని.. నీచంగా దూషణలు చేసి... చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అంటూ మండిపడ్డారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందన్నారు. జోగి రమేష్‌తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెలు మీద తన్నిన విధంగా ఉందన్నారు.


వాళ్లు నాకు ఆరాధ్య దైవం...

‘‘మా నాయకులను నేను ఏమీ అనలేను.. కానీ అలా జరగకుండా చూసుకోవాల్సింది. జోగి రమేష్‌ను మేము అడ్డుకుని ఉండకపోతే ఆరోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడు. మేము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారు. ఆ గలాటాలో నాకు ఊపిరి అందక కిందపడ్డాను. చనిపోతాను అని అందరూ అనుకున్నారు. ఆ పక్కనే అప్పుడు గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావులు కూడా ఉన్నారు. 23 స్థానాల నుంచి మళ్లీ ఈ విజయం అందుకున్నాం అంటే ఒకే ఒక్క నేత చంద్రబాబు వల్లే సాధ్యం అయ్యింది. మేమంతా ఆయన అడుగు జాడల్లో నడిచి పని చేశాం. చంద్రబాబుపై అభిమానంతో మేము పోరాటాలు చేశాం. నిన్న జోగి రమేష్ ఉదంతం చూసి ఆశ్చర్యపోయాను. చంద్రబాబు, లోకేష్‌లు నాకు పదవులు ఇవ్వకపోయినా ఆ కుటుంబం పట్ల విధేయినిగానే ఉంటాను. నాకు వాళ్లు ఆరాధ్య దైవం... పార్టీ, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సత్యభామ తరహాలో భువనేశ్వరి బయటకి వచ్చారు. ఇంటికే పరిమితం అయిన భువనేశ్వరి, బ్రాహ్మణిలు రాష్ట్రం కోసం ప్రజల్లోకి వచ్చారు. అంటే ఆ కుటుంబం మొత్తం ఎప్పుడూ రాష్ట్రం హితం, ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తూనే ఉంటారు. వారికి ఉడత సాయంగా మా వంతు సహకారం అందిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.


మీ సమాధానం కావాలి...

‘‘నిన్న నూజివీడులో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదు. ఎలా జరిగినా... అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించాల్సి ఉంది. జోగి రమేష్‌ను చూశాక అయినా వేదిక నుంచో, ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సింది. గౌతు లచ్చన్న ఒక కుల నాయకుడు కాదు. నేడు వంగవీటి మోహనరంగాకు లక్షల విగ్రహాలు ఉన్నాయి. అన్ని కులాల వారు ఆరాధించారు కాబట్టే రంగా దేవుడు అయ్యాడు. వాళ్ల అబ్బాయి రాధా కూడా కులాలకు అతీతంగా పని చేస్తున్నారు. గౌతు శిరీష అంటే మాకు కూడా ఎంతో అభిమానం ఉంది. కానీ నిన్న జరిగిన ఘటన కారణంగా క్యాడర్ మొత్తం చాలా బాధ పడింది. పార్థసారథి, కొనకళ్ల నారాయణ, శిరీషలు ముగ్గురూ సౌమ్యులే. కేవలం క్షమాపణ చెబితే సరిపోదు.. క్యాడర్‌కు సమాధానం చెప్పాలి’’ అని కోరారు.


పోరాటాలు చేయాలా? వద్దా?

‘‘బియ్యం దొంగ పేర్ని నాని నా పైనే ఫిర్యాదు చేశారు. నాని, వంశీలను చంపేస్తా అని బుద్ధా వెంకన్న బెదిరించాడని చెప్పాడు. జోగి రమేష్ నోటికి వచ్చిన విధంగా బూతులు తిట్టాడు. వారితో టీడీపీ నేతలు అంట కాగితే... మేమెలా పోరాటాలు చేయాలి. దీనిపై పార్టీ అధిష్టానం కూడా స్పందించి మాకు గైడెన్స్ ఇవ్వాలి. ఒక్కోసారి అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే భావన కలుగుతుంది. చంద్రబాబును తిడితేనే నేను వాళ్లకు కౌంటర్ ఇచ్చా. కేశినేని నానితో నాకు గొడవ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ట్వీట్ పెట్టినందుకే. విజయ సాయి రెడ్డి మొన్న చంద్రబాబును తూలనాడితే మా నేతలు స్పందించలేదు. కొందరు తమల‌పాకుతో కొట్టినట్లు మాట్లాడి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు కుటుంబంలో ఉన్న నలుగురు నాలుగు దిక్కులుగా మారి ప్రజల కోసం పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మా మీద ఎన్నో కేసులు పెట్టారు.. ఇప్పటికీ విచారణ సాగుతోంది. మరి ఇప్పుడు పోరాటాలు చేయాలా వద్దా అనే అనుమానం కలుగుతుంది. జోగి రమేష్‌తో కలిసి వేదిక పంచుకున్న నేతలు, కార్యకర్తకలను శాంతింప చేయాలి. నారా లోకేష్‌ను కలిసి కూడా జరిగిన విషయం వివరించాలి. జోగి రమేష్ వంటి వ్యక్తులను టీడీపీలో అస్సలు చేర్చుకోకూడదు’’ అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

టీడీపీలో ‘జోగి’ రచ్చ

తండ్రీకొడుకులకు బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 01:09 PM