Share News

AP Cabinet: మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఆసక్తి.. జనసేన డిమాండ్ చేస్తున్నవి ఇవే..!

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. కీలక శాఖలను ఎవరికి ఇస్తారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.

AP Cabinet: మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఆసక్తి.. జనసేన డిమాండ్ చేస్తున్నవి ఇవే..!
Janasena Leaders

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. కీలక శాఖలను ఎవరికి ఇస్తారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు కేబినెట్ సీనియర్లు, గతంలో మంత్రులుగా చేసినవాళ్లున్నారు. దీంతో సీనియర్లకే కీలక శాఖలు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు మంత్రివర్గంలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన మంత్రులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వలో బీజేపీ భాగస్వామిగా ఉన్న సమయంలో దేవాదాయ, వైద్య ఆరోగ్య శాఖలను కేటాయించారు. ప్రస్తుతం జనసేన, బీజేపీకి చెందిన నలుగురు ఉండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జనసేనానికి కీలకమైన హోంశాఖ ఇస్తారంటూ జనసైనికులు ప్రచారం చేసుకుంటున్నారు. పవన్‌కు కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ హోం లేదా రెవెన్యూ శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వొచ్చని లేదా పంచాయతీరాజ్ శాఖను కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.


జనసేన ఆశిస్తున్న శాఖలు అవేనా..

జనసేన నుంచి ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నారు. వీరిలో గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఎవరికి లేదు. నాదేండ్ల మనోహర్ మాత్రం శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ముగ్గురు కొత్తవాళ్లే. అయితే తమకు కీలక శాఖలు కావాలని ఆశిస్తున్నారట. రెండు కీలక శాఖలతో పాటు మరొకటి ఏదైనా పర్వాలేదని ఇప్పటికే తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకు తెలియజేశారట. హోం, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల్లో ఏవైనా రెండు శాఖలను జనసేన ఆశిస్తుందట. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ పార్టీలో కీలక నేతలు కావడంతో ఆ ఇద్దరికీ ముఖ్యమైన శాఖలను కోరుతున్నట్లు తెలుస్తోంది. అటవీ, పర్యావరణతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలను జనసేనకు కేటాయించే అవకాశం లేకపోలేదు. ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.


బీజేపీకి మళ్లీ అదేనా..

గతంలో బీజేపీకి దేవాదాయ శాఖను కేటాయించారు. ప్రస్తుతం బీజేపీ నుంచి ఒకరు మంత్రివర్గంలో ఉన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కేబినెట్‌లో ఉండగా.. ఆయనకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఆయన కీలకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో సత్యకుమార్ ప్రాధాన్యత ఉన్న శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రహదారులు భవనాలు లేదా పంచాయతీ రాజ్ శాఖను సత్యకుమార్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 12 , 2024 | 04:00 PM