AP NEWS: అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో బందర్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు: డీసీపీ కె.చక్రవర్తి
ABN , Publish Date - Jan 17 , 2024 | 10:28 PM
విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన ఉండడంతో ఆ ప్రాంతంలో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె.చక్రవర్తి ( DCP K. Chakraborty ) తెలిపారు.
విజయవాడ: విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన ఉండడంతో ఆ ప్రాంతంలో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె.చక్రవర్తి ( DCP K. Chakraborty ) తెలిపారు. బుధవారం నాడు డీసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. నగరం వెలుపల నుంచే భారీ, మధ్య తరహా రవాణా, వాహనాల రాకపోకలను మళ్లించినట్లు చేప్పారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు భారీ మరియు మధ్య తరహా వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామని చెప్పారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. 19న విజయవాడ నగరంలోనూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ రాకపోకలను మళ్లిస్తున్నామని చెప్పారు. సభ కోసం వాహనాలలో వచ్చే వారికోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సభకు అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సభకు సుమారు లక్ష 30 వేల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 బస్సులు, 2000 వేలకు పైగా కార్లకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని డీసీపీ కె.చక్రవర్తి తెలిపారు.