Vijayawada: ఇక మీ ప్రయాణం ఎంతో ఈజీ.. విజయవాడ పోలీసుల వినూత్న ప్రయోగం
ABN , Publish Date - Oct 22 , 2024 | 09:26 AM
బెజవాడ నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ నియంత్రణకు సాంతిక పరిజ్ఞానంతో ప్రత్యేక డ్రోన్‌లను వినియోగించనున్నారు. ట్రాఫిక్ జంక్షన్లుగా ఉన్న బెంజ్‌సర్కిల్, రామవరప్పాడురింగ్, వారధి, ప్రకాశం బ్యారేజ్, పీఎన్‌బీఎస్, గొల్లపూడి వైజంక్షన్ వంటి ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రహదారులపై ట్రాఫిక్ వాస్తవ పరిస్థితిని గూగుల్ మ్యాప్ ద్వారా గమనిస్తు డ్రోన్లను ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక యాప్ రూపొందించిన కాప్స్
గూగుల్ మ్యాప్స్ ద్వారా అప్‌డేట్స్
కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేక వీక్షణ
అప్పటికప్పుడు వ్యూహాత్మక ప్రణాళికలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): స్ర్కూబ్రిడ్జి వైపు నుంచి బందరు రోడ్డులోకి వాహనాలు వెళ్లాల్సి ఉంది. ఈ వాహనాలన్నీ బెంజ్‌సర్కిల్ వద్ద రెడ్‌సిగ్నల్ పడటంతో ఆగిపోయాయి. తర్వాత కాసేపటికి గ్రీన్‌సిగ్నల్ పడింది. సరిగ్గా ఆ వాహనాలు జంక్షన్ వద్దకు వచ్చేసరికి మళ్లీ రెడ్‌సిగ్నల్ పడింది. మళ్లీ గ్రీన్‌సిగ్నల్ పడే వరకు ఆ వాహనాలు కూడలి వద్ద ఆగిపోయాయి.
ఎంజీ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వైపు ట్రాఫిక్ కొన్నిసెకన్ల వ్యత్యాసంతో కదులుతోంది. ఆ తర్వాత నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వంతు వస్తుంది. ఆ తర్వాత స్ర్కూబ్రిడ్జి వైపు ట్రాఫిక్‌ను వదులుతారు. ఒక వైపున ఉన్న ట్రాఫిక్ మొత్తం క్లియరయ్యే వరకు మిగిలిన అన్ని వైపులా ట్రాఫిక్‌ను నిలుపుదల చేస్తారు. సిగ్నల్స్‌తో పనిలేకుండా ట్రాఫిక్‌ను నియంత్రిస్తే కనిపిస్తున్న సమస్య ఇది.
విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లాలంటే వారధి ఎక్కాలి. ఒక్కోసారి వారధిపై ఏదో ఒక వాహనం బ్రేక్‌డౌన్ అవుతోంది. ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాలన్నీ ఆగిపోతున్నాయి. ఈ ప్రభావం స్ర్కూబ్రిడ్జి వరకు పడుతోంది.
CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాల ప్రగతిపై సమీక్షించిన సీఎం
నగరంలో కీలకప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్య ఇది. వాస్తవానికి ట్రాఫిక్ సమస్య విజయవాడను సతమతం చేస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్నంత వేగంగా ఇక్కడ సదుపాయాలు మెరుగుపడడం లేదు. విజయవాడలో ట్రాఫిక్ ప్రధానమైన సమస్యగా ఉందని ఇక్కడికి వచ్చిన ప్రతి పోలీసు కమిషనర్ అంగీకరిస్తున్నారు. ఆ అధికారులు ట్రాఫిక్‌ను గాడిలో పెట్టడానికి ఏదోఒక ప్రయత్నం చేసే లోపు దానికి బ్రేక్‌లు పడుతున్నాయి. నగరంలో ఏటీఎంఎస్ (అడాప్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం) ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ లోపు ఎంతోకొంత మేరకు ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనదారుల ఇం‘ధనాన్ని’ ఆదా చేసుకునేలా చేయాలని పోలీసు అధికారులు భావించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రహదారులపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అస్త్రం యాప్‌ను తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ యాప్ ద్వారా చాలావరకు ట్రాఫిక్ నియంత్రణ జరగడంతో దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.
గూగుల్ మ్యాప్స్ జతచేసి..
నగరంలో ట్రాఫిక్ రద్దీ, అప్‌డేట్ కోసం అనేక యాప్‌లున్నాయి. ఎక్కువమంది వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తారు. పోలీసులు తయారు చేయించిన అస్త్రం యాప్‌ను గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేశారు. ఈ మ్యాప్‌లో చూపించిన ట్రాఫిక్ రద్దీని యాప్ ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తుంది. అంతేగాకుండా కీలక సమయాల్లో, కీలకమైన జంక్షన్లుగా ఉన్న బెంజ్‌సర్కిల్, రామవరప్పాడురింగ్, వారధి, ప్రకాశం బ్యారేజ్, పీఎన్‌బీఎస్, గొల్లపూడి వైజంక్షన్ వంటి ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రహదారులపై ట్రాఫిక్ వాస్తవ పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ డ్రోన్లను ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడున్న వీడియోవాల్‌పై ట్రాఫిక్ ఎంత దూరంలో ఆగిందో తెలుస్తుంది. మ్యాప్స్ ద్వారా తీసుకున్న సమాచారం జంక్షన్ ట్రాఫిక్ ఎన్నిమీటర్ల దూరంలో ఆగిపోయిందో అలర్ట్స్ ఇస్తుంది. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఆయా కూడళ్లలో ఇన్‌స్పెక్టర్లకు వైర్‌లెస్ సెట్‌లో సమాచారం చేరవేస్తున్నారు. అప్పటికప్పుడు ట్రాఫిక్ తక్కువగా ఉన్న రహదారులను గుర్తించి వాటిలోకి వాహనాలను మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ తక్కువగా ఉన్న రహదారులపై వాహనాలను నిలుపుదల చేసి, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రహదారులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు వాహనదారులు ట్రాఫిక్‌లో ఎక్కువసేపు చిక్కుకుని ఉండకుండా ఉండేందుకు అస్త్రం బాగా ఉపయోగపడుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నగరంలో కొత్త సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేవరకు అస్త్రం సేవలను వినియోగించుకునే యోచనలో అధికారులు ఉన్నారు.
ఉచిత ఇసుక దుర్వినియోగం కావొద్దు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here