Kurnool: ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:41 AM
కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో గురువారం ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నటేకూరు గ్రామంలో ఊరేగింపు సమయంలో ప్రభకు విద్యుత్ వైరు తగిలి షార్ట్‌సర్క్యుట్ కావడంతో ప్రభలో కూర్చున్న 13 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. చిన్నటేకూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
- ప్రభకు విద్యుత్‌వైర్ తగలడంతో షార్ట్‌సర్క్యూట్
- విద్యుదాఘాతంతో 13 మంది చిన్నారులకు గాయాలు
- తప్పిన పెను ప్రమాదం
కర్నూలు, ఏప్రిల్ 11: కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో గురువారం ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నటేకూరు గ్రామంలో ఊరేగింపు సమయంలో ప్రభకు విద్యుత్ వైరు తగిలి షార్ట్‌సర్క్యుట్ కావడంతో ప్రభలో కూర్చున్న 13 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. చిన్నటేకూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి దేవాలయ ప్రభలను గ్రామమంతా ఊరేగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సుమారు 13 మంది బాలురు కూర్చున్న ప్రభను లాగుతుండగా.. రోడ్డుపైన స్పీడు బ్రేకర్ ఉండటంతో దాన్ని ఎక్కించారు. దీంతో విద్యుత్ తీగలు ప్రభపై ఉన్న ఇనుప చక్రాన్ని తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించింది. ప్రభలో కూర్చున్న చిన్నారులందరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. కొంతమంది షాక్‌కు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ప్రభ వెంటనే కొంచెం ముందుకు వెళ్లడంతో వైర్లు వీడి పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డ చిన్నారులను స్థానికులు అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించడంతో చిన్నారులంతా కోలుకున్నారు. ఒకరిద్దరికి మాత్రం ఎక్కువగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ తీగలకు కరెంటు తీసేశామని, కరెంటు ఎలా సరఫరా అయిందో తెలియడం లేదని గ్రామస్థులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఉలిందకొండ ఎస్‌ఐ నరేష్ తెలిపారు.