గాలేరు నగరిలో పడిన 40 బర్రెలు
ABN , Publish Date - Oct 24 , 2024 | 12:48 AM
మండలంలోని సుగాలిమెట్ట సమీపంలో బర్రెలు ప్రమాదవశాత్తు గాలేరునగరి కాలువలో పడ్డాయి.
సత్వర చర్యలతో సురక్షితంగా బయటకు..
పాణ్యం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుగాలిమెట్ట సమీపంలో బర్రెలు ప్రమాదవశాత్తు గాలేరునగరి కాలువలో పడ్డాయి. బుధవారం సుగాలిమెట్టకు చెందిన కాపరులు 40 బర్రెలు మేపడానికి సమీప కొండకు వెళ్లారు. ఎండ తీవ్రతకు బర్రెలు సమీప కాలువలోకి నీరు తాగడానికై కాలువలో దిగడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో కాపరులు కాలువ వెంట దాదాపు 20 కిలోమీటర్లు వెళ్లారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితకు సమాచారం ఇచ్చినట్లు టీడీపీ నాయకుడు కె. చంద్రానాయక్ తెలిపారు. ఆమె వెంటనే గాలేరునగరి ఎస్‌ఈ వరప్రసాద్‌కు సమాచారం అందించడంతో కాలువ గేట్లు మూసివేసి నీటిని తగ్గించడంతో బనగానపల్లె మండలం రామతీర్థం, చెరువుపల్లె మద్య బర్రెలు బయటికి వచ్చినట్లు తెలిపారు. ఘటనా సమయంలో కాలువలో 6500ల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండడంతో ప్రవాహ వేగానికి బర్రెలు కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఉదయం 12 గంటలకు కొట్టుకుపోయిన బర్రెలు సాయంత్రం 5 గంటలకు బయటికి వచ్చినట్లు పాడి రైతులు తెలిపారు. నిత్యం కాల్వ సమీపంలో మేతకు వెళ్లే పాడిపశువులు కాల్వ దాటడానికి స్లూయిజ్ ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా అధికారులను కోరినట్లు తెలిపారు.