Share News

ఉపాధి పనుల్లో రూ.6.59 లక్షల అవినీతి

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:40 AM

మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2023-24 ఏడాదిలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగిన రూ.6.59 లక్షలను రికవరీ చేయాలని, రూ. 43,900 ఉపాధి సిబ్బంది జరిమానా చెల్లించాలని డ్వామా పీడీ జనార్దన్‌రావు ఆదేశించారు.

ఉపాధి పనుల్లో రూ.6.59 లక్షల అవినీతి
సామాజిక తనిఖీ ప్రజావేదికలో పాల్గొన్న అధికారులు

బేతంచెర్ల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2023-24 ఏడాదిలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగిన రూ.6.59 లక్షలను రికవరీ చేయాలని, రూ. 43,900 ఉపాధి సిబ్బంది జరిమానా చెల్లించాలని డ్వామా పీడీ జనార్దన్‌రావు ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో 18వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం ఎంపీడీవో ఫజిల్‌ రెహిమాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్పీ, ఎస్సార్‌ సామాజిక తనిఖీ బృందం ఆయా గ్రామాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీని ఉపాధి సిబ్బంది చేసిన అవినీతి అక్రమాల పనులపై చదివి అధికారులకు వినిపించారు. 2023-24 ఏడాదిలో బేతంచెర్ల మండలానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1065 పనులకు రూ.10.66 కోట్ల పంచాయతీరాజ్‌ పనుల కింద 15 పనులకు రూ.17.91 కోట్లు మొత్తం రూ.12.45 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనుల్లో ఉపాధి సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతూ గ్రామాల్లో ఉపాధి కూలీలు పనులు చేయకుండానే పనులు చేసినట్లు బిల్లులు చేశారని శంకరాపురం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి కూతురు రాధిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉండగా ఆమె పనిని గోపాల్‌ రెడ్డి నిర్వహిస్తున్నాడని, సీతారామాపురం గ్రామ మాజీ సర్పంచ్‌ వెంకటరాముడు, గ్రామ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అన్ని గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పర్యవేక్షణ లోపంతోనే అక్రమాలు జరిగాయని సామాజిక తనిఖీ బృందం అధికారులకు విన్నవించింది. ముఖ్యంగా ఏపీవో శేషన్న కార్యాలయానికి పరిమితం కావడంతో ఉపాధి పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలు జరిగాయని డ్వామా పీడీ జనార్దన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ బాలాజీనాయక్‌, సురేంద్ర కుమార్‌, ఏపీవో శేషన్న, మండల ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాది సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:40 AM