సోనా మసూరి రకం అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:43 AM
సోనామసూరి రకాన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు.
నందికొట్కూరు రూరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సోనామసూరి రకాన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. నందికొట్కూరు మండలంలోని శాతనకోట గ్రామంలో శనివారం రైతు స్వామి మురళి వరిపొలంలో జిల్లా వ్యవసాయాధికారితో పాటు నందికొట్కూరు ఏడీఏ విజయశేఖర్ వరి పంటలో (సోనామసూరి) బీపీటీ 5204 రకం పంటను కోత దశలో పరిశీలించి 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కోత కోయించి పంట దిగుబడిని అంచనా వేశారు. వారు మాట్లాడుతూ రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల శాతనకోట గ్రామంలో ఎకరాకు 35.24 క్వింటాళ్ళు దిగుబడి వచ్చిందని తెలిపారు. వరిలో సన్నరకాలైన (సోనామసూరి) బీపీటీ 5024 రకం ఎక్కువగా కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రాంతంలో పండిస్తారని తెలిపారు. ఈ రకం వరిధాన్యం రాయల సీమ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ సోనామసూరి రకం దేశంలోనే ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచిందని అన్నారు. ఈ సన్నరకం వరిధాన్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారని అన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి వస్తుందని, ఈ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏవో షేక్షావలి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
పగిడ్యాల(ఆంధ్రజ్యోతి): ఎరువులు, పురుగుల మందులను ఎమార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ హెచ్చరించారు. పగిడ్యాలలోని మల్లికార్జున ఎరువుల దుకాణాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. అనతరం వ్యవసాయ కార్యాలయంలో సిబ్బందితో పంట నమోదు, ఫసల్ బీమాపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన వెంట నందికొట్కూరు ఏడీఏ విజయశేఖర్, వ్యవసాయాధికారి జ్యోత్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.