పంట సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి: డీఏవో
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:18 AM
పంట సాగులో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు.
గడివేముల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పంట సాగులో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు. మండలంలోని గడిగరేవుల, గ్రంధివేముల, చిందుకూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, సోయా పంటలను పరిశీలించారు. జొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఈనెల 31వ తేదీ వరకు పంట బీమా గడువు పెంచారని తెలిపారు. రైతులు ప్రీమియం చెల్లించి పంట బీమా చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సిబ్బందికి ఈ-పంట, పీఎం కిసాన్, పొలం పిలుస్తోంది, కౌలు రైతుల రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని దుర్గాభవాని, వెంకటేశ్వర ట్రేడర్స్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ధరల పట్టికను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల విక్రయాల గురించి రికార్డులను సక్రమంగా నిర్వహించాల న్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.