ఉపాధి పనుల్లో అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:07 AM
ఉపాధి నిధులను సక్రమంగా వినియోగించకుండా, ఉద్యోగుల కుటుంబాలకు, మృతిచెందిన వారికి ఉపాధి నిధులను ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి సిబ్బంది కలిసి వారి ఖాతాలకు జమచేశారని సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ వెంకటమ్మతో పాటు గ్రామస్థులు ఉపాధి పీడీకి ఫిర్యాదు చేశారు.
జూపాడుబంగ్లా, సెప్టెంబరు 4: ఉపాధి నిధులను సక్రమంగా వినియోగించకుండా, ఉద్యోగుల కుటుంబాలకు, మృతిచెందిన వారికి ఉపాధి నిధులను ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి సిబ్బంది కలిసి వారి ఖాతాలకు జమచేశారని సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ వెంకటమ్మతో పాటు గ్రామస్థులు ఉపాధి పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం జూపాడుబంగ్లాలోని గ్రామ సచివాలయంలో విచారణ చేపట్టారు. విచారణకు ఏపీడీ అన్వరాబేగం, అంబుడ్స్‌మన్ సురేంద్రకుమార్ హాజరయ్యారు. అయితే ఏపీవో గౌరిబాయి, ఎంపీడీవో నూర్జహాన్ ఆలస్యంగా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఎక్కడికి వెళ్లేదంటూ మండిపడ్డారు. అప్పటికే సచివాలయం వద్ద భారీస్థాయిలో గ్రామస్థులు, ఇరువర్గాల టీడీపీ నాయకులు రావడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, ఏఎస్‌ఐ మేరీజయంతి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ సమయంలో ఫీల్ట్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. విచారణ అధికారులు వచ్చిన వారి ఖాతాల వివరాలు, జాబ్‌కార్డులు, పనిప్రదేశంలో చేసిన ఫొటోలు తదితర వాటిని పరిగణనలోనికి తీసుకొని విచారించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విచారణ చేసి నివేదికను పీడీకి అందజేస్తామని విలేకరులకు తెలిపారు. ఫిర్యాదుదారులు ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారని విచారణ అధికారులకు జిరాక్సు ప్రతులను సమర్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పనులు చేసిన ఫొటోలను అందజేశారు. పంచాయతీ కార్యదర్శి శాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.