Share News

ముగిసిన కార్తీక మాసోత్సవాలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:49 AM

మహానంది క్షేత్రంలో కార్తీకమాసం ముగింపు పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు ఆదివారం పూజలు నిర్వహించేందుకు తరలివచ్చారు.

ముగిసిన కార్తీక మాసోత్సవాలు
మహానందిలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

మహానంది, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో కార్తీకమాసం ముగింపు పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు ఆదివారం పూజలు నిర్వహించేందుకు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు రెండో ప్రాకారంలోని పూల కోనేర్లల్లో వేకువజాముననే కార్తీక పుణ్యస్నానాలు ఆచరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయం ముందు భాగంలోని ధ్వజస్తంభంతో పాటు నాగులకట్ట వద్ద దీపాలు వెలిగించారు. పరమశివుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో మహానది క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. దర్శనార్థమై క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గరుడ నంది ఆలయం వద్ద దేవస్థానం భజన గురువు రాముడుగౌడ్‌ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వివిధ సేవల ద్వారా రూ.లక్షలాది ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గడివేముల: కార్తీకమాస చివరి రోజు సందర్భంగా పైబోగుల సమీపంలో ఏడు ఊర్ల గవి భక్తులతో కిటకిటలాడింది. గవిలో ఉన్న గంగా ఉమా సమేత సర్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన భక్తులకు మాజీ ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

నందికొట్కూరు రూరల్‌: కార్తీక మాసం చివరి రోజున నందికొట్కూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఆర్యవైస్యసంఘం ఆధ్వర్యంలో తులసీ దామోదర స్వామి కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీ మాస వనభోజనం ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.

కొత్తపల్లి: కొత్తపల్లి తాండవ మల్లేశ్వరస్వామి ఆలయంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజున గ్రామస్థుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున వన భోజన కార్యక్రమం చేపట్టారు.

పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలోని గంగా పార్వతి నాగేశ్వరస్వామి దేవాలయంలో కార్తీకమాసం చివరి రోజును పురస్కరించుకొని ఆదివారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతరం భక్తులకు వనభోజనం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, మండల కన్వీనరు పలుచాని మహేశ్వరరెడ్డి, బీజేపీ శంకర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల కల్చరల్‌: మహాదేవునికి పవిత్ర కార్తీక మాసం పురష్కరించుకొని నంద్యాల పట్టణంలోని కోదండ రామాలయం ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఘనంగా కాశీ విశాలక్ష్మి దేవికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఏడాది ప్రధమంగా స్వామి వారికి నిత్య భక్తుల సహకారంతో భగవత్‌ సేవా సమాజ్‌ ఆధ్వర్యంలో రుధ్ర పఠనం చేస్తూ పుష్పాభిషేకం భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహించారు.

నంద్యాల పట్టణంలోని బసవేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణంను రుత్వికులు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

ఆత్మకూరు రూరల్‌: నల్లమల అభయారణ్యంలో వెలిసిన రుద్రకోటేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన రుద్రాణి సహిత రుద్రకోటేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల సమయంలోనే ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు చేశారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు రాఘవరావు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 02 , 2024 | 12:49 AM