Share News

Onion Price : ఉల్లి ధరలో మాయాజాలం

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:38 PM

నారాయణ అనే రైతు వర్కూరు గ్రామంలో తనకున్న నాలుగెకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు.

Onion Price : ఉల్లి ధరలో మాయాజాలం
Onion

వ్యాపారుల కనుసన్నల్లో ధరల నిర్ణయం

యార్డుల కంటే గ్రామాల్లోనే ఎక్కువ ధర

భారీగా జీరో.. సెస్సుకు గండి

చోద్యం చూస్తున్న అధికారులు

టెండరు విధానంలోనూ రైతులకు అన్యాయమే..


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 28: నారాయణ అనే రైతు వర్కూరు గ్రామంలో తనకున్న నాలుగెకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు. దాదాపు ఎకరాకు రూ.60 వేల దాకా ఖర్చు చేశాడు. పంట దిగుబడిని కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకు వస్తే.. వ్యాపారులు క్వింటానికి రూ.2,500 చెల్లిస్తామని గిరి గీయడంతో ఇదేమి అన్యాయమంటూ ఉల్లిని మళ్లీ ట్రాక్టరులో తీసుకుని గ్రామానికి వెళ్లిపోయాడు. అక్కడ వ్యాపారులు క్వింటానికి రూ.3 వేలు చెల్లించినట్లు రైతు నారాయణ తెలిపారు. మార్కెట్‌ యార్డు కంటే గ్రామాల్లో వ్యాపారులే నయమని రైతులు అంటున్నారు. ఉల్లి ధరలో ఇదేమి మాయాజాలం అని రైతులు ప్రశ్నిస్తున్నారు.


నష్టాలే..

రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లిని సాగు చేస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రైతులకు చివరకు కడగండ్లే మిగులుతున్నాయి. ఈ సంవత్సరం ప్రస్తుత ఖరీఫ్‌లో దాదాపు 50వేల ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారు. 50వేల ఎకరాల్లో దిగుబడిని లెక్కేస్తే.. 25 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సెప్టెంబరు 1వ తేదీ నుంచి మంగళవారం 24వ తేదీ వరకు కర్నూలు మార్కెట్‌ యార్డుకు దాదాపు 90వేల క్వింటాళ్ల ఉల్లిని రైతులు అమ్ముకున్నారు. అదే విధంగా గ్రామాల్లో వ్యాపారులు దాదాపు 2 లక్షల క్వింటాళ్ల ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ 2 లక్షల క్వింటాళ్లకు సంబందించి మార్కెట్‌ కమిటికి వ్యాపారులు చెల్లించాల్సిన సెస్సుకు గండి కొట్టినట్లయింది. మరో వైపు కర్నూలు జిల్లాలోని ఉల్లి కొనుగోలు కేవలం ఒక్క కర్నూలు మార్కెట్‌ యార్డులోనే కొనసాగుతున్నది. రైతులు ఈ మార్కెట్‌ యార్డులో తమకు గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో మారుమూల గ్రామాల నుంచి కర్నూలు యార్డుకు ఉల్లిని అమ్ముకునేందుకు తరలివస్తున్నారు. అయితే.. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల సిండికేట్‌తో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేవలం కొంత మంది రైతులకు మాత్రమే గరిష్ఠ ధర దక్కుతుండగా.. నాణ్యత లేదనే సాకుతో కమిషన్‌ ఏజెంట్లు మధ్యస్థ, కనిష్ఠ ధరలు మాత్రమే అధిక మొత్తం ఉల్లికి ధరను నిర్ణయిస్తుండటంతో రైతులు రైతులు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప.. వారికి మరో దారి కనిపించడం లేదు. గ్రామాల్లోకి రైతులు వచ్చి అధిక ధరను చెల్లిస్తామని వ్యాపారులు బతిమిలాడినా కర్నూలు మార్కెట్‌ యార్డులో ఎక్కువ ధర లభిస్తుందనే ఆశతో వస్తే కమిషన్‌ ఏజెంట్లు మాత్రం తక్కువ ధరను చూపి రైతులను నట్టేట ముంచుతున్నారు. కొంత మంది రైతులు మరోదారి లేక కమిషన్‌ ఏజెంట్లకు అమ్ముకుంటే చాలా మంది రైతులు గ్రామాలకే ఉల్లిని తీసుకెళ్లి అక్కడ అమ్ముకుంటున్నారు. టెండరు విధానంలో రైతులకు ఎక్కువ ధర లభిస్తుందని, లైసెన్సు తీసుకున్న వ్యాపారులంతా పోటీ పడి ఉల్లిని కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్న మాటలు నీటిమూటలయ్యాయి.


మార్కెట్‌ యార్డులో మాయాజాలం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 50వేల ఎకరాల్లో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సాగైంది. ఇంత పెద్ద మొత్తంలో ఉల్లి పంట రాష్ట్రంలో ఎక్కడా సాగు కాకపోవడం గమనార్హం. మహారాష్ట్ర తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పెద్ద ఎత్తున రైతులు ఉల్లిని సాగు చేస్తున్నారు. అయితే.. అధికారుల నిర్లక్ష్యం, కమిషన్‌ ఏజెంట్ల సిండికేట్‌తో ఉల్లి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. గత రెండేళ్లుగా భారీ వర్షాలు, తుఫాన్‌లతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.60వేల దాకా ఉల్లి పంట సాగు కోసం రైతులు ఖర్చు చేస్తే కేవలం ఎకరాకు 20 క్విటాళ్ల కంటే తక్కువే దిగుబడి పొందారు. కనీసం ఈ ధరకైనా అమ్ముకుందామని రైతులు ఎంతో ఆశతో ఉన్నా కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు తమ జేబులు నింపుకోవడానికే అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సరం రైతులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఉల్లిని అమ్మకానికి తీసుకురావడం మొదలైంది. అయితే.. యార్డులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుండటంతో కొంత మంది రైతులు మరోదారి లేక ఈ యార్డులోనే అమ్ముకుంటుండగా.. మరికొంత మంది రైతులు గ్రామాలకు తీసుకెళ్లి అక్కడ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. సెప్టెంబరు నెలలో 24వ తేదీ వరకు దాదాపు 90వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లిని రైతులు అమ్మకానికి తెచ్చారు. ఈ మొత్తం ఉల్లిలో కొంత ఉల్లిని కేవలం క్వింటానికి రూ.297లకు మాత్రమే కొనుగోలు చేశారు. మధ్యస్థ రకం ఉల్లికి రూ.1,500 నుంచి రూ.3,639, గరిష్ఠంగా క్వింటానికి రూ.4,129లు రైతులకు దక్కింది. కనిష్ఠ, మధ్యస్థ ధరలకు అమ్ముకున్న రైతులు తాము నష్టపోయామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.


ధర గిట్టుబాటు గాక వెనుదిరుగుతున్న రైతులు

కర్నూలు మార్కెట్‌ యార్డులో ధర తమకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని, తిరిగి తమ గ్రామాలకే అధిక రవాణా ఖర్చులు భరించి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వ్యాపారుల నుంచి క్వింటానికి రూ.3వేలకు పైగా ధర లభిస్తుంటే.. మార్కెట్‌ యార్డులో కేవలం రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని, అందువల్ల మార్కెట్‌ యార్డులో నుంచి రవాణా ఖర్చులు భరించి మళ్లీ గ్రామాలకే తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌ యార్డులో ఎక్కువ ధర రావాల్సిందిపోయి.. దానికి విరుద్ధంగా గ్రామాల్లో వ్యాపారుల కంటే తక్కువ ధరకు తీసుకుంటున్నారని, ఇదేమి అన్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.


టెండరు విధానం అమలులోకి వచ్చినా ప్రయోజనం శూన్యమే

గతంలో కర్నూలు మార్కెట్‌ యార్డులో వ్యాపారులే రైతుల వద్దకు వెళ్లి నాణ్యతను పరిశీలించి ధరను నిర్ణయించే వారు. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని నిర్ణయించి మిగిలిన పంట ఉత్పత్తుల మాదిరిగా కొనుగోళ్లను టెండరు విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో వ్యాపారులు తమకు టెండరు విధానం ఏ మాత్రం సమ్మతి కాదని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకదశలో కొనుగోళ్లను కూడా నిలిపివేశారు. అయితే.. అప్పట్లో మార్కెట్‌ కమిటీ అధికారులు వ్యాపారుల చేత బలవంతంగా టెండరు విధానాన్ని అమలు చేశారు. రైతులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించి మద్దతు పలికారు. అయితే.. పాత సీసాలో కొత్తసారా అన్న చందంగా రైతుల పరిస్థితి మారింది. గతంలో మాదిరిగానే తక్కువ ధర లభించడంతో రైతులు కన్నీళ్లతో భాదపడటం తప్ప.. మరోదారి కనిపించడం లేదు. వాస్తవంగా కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి కొనుగోలుకు సంబంధించి 30 మంది వ్యాపారులకు లైసెన్సులు ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం కేవలం ఐదుగురు వ్యాపారులు మాత్రమే ఉల్లి టెండరులో పాల్గొంటున్నారు. ఈ ఐదుగురు రైతులు తమకు అనుకూలమైన ధరను మాత్రమే నిర్ణయిస్తున్నారు. వీరు కొనుగోలు చేసిన ఉల్లిని మిగిలిన వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుండటం గమనార్హం. లైసెన్సు తీసుకున్న వ్యాపారులు ఎందుకు టెండరులో పాల్గొనడం లేదో అధికారులు సరైన జవాబు ఇవ్వలేక పోతున్నారు. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. వ్యాపారులందరి టెండరులో పాల్గొనేలా చేస్తే పోటీ ఎక్కువై ధర తమకు సక్రమంగా అంది న్యాయం జరుగతుందని రైతులు చెబుతున్నారు.


భారీగా సెస్సుకు గండి

ఈ సంవత్సరం ఖరీఫ్‌లో దాదాపు 50వేల ఎకరాల్లో ఉల్లిని రైతులు సాగు చేశారు. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడిని లెక్కించినా దాదాపు 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి రైతులకు అందుతుందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తంపై సెస్సు పెద్ద ఎత్తున రావాల్సి ఉండగా.. వ్యాపారుల సిండికేట్‌తో తక్కువ ధర లభిస్తుందనే భయంతో రైతులు గ్రామాల్లోనే దళారులు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మార్కెట్‌ యార్డుపై రైతుల భయాన్ని ఆసరగా తీసుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని దాదాపు వంద మంది దళారులు, వ్యాపారులు గ్రామాల్లోకి లారీలను తీసుకెళ్లి రైతుల నుంచి తక్కువ తూకాలు వేసి కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారులు హైదరాబాదు, తమిళనాడు, ఢిల్లీ, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి రెట్టింపు ధరలకు అమ్ముకుని రూ.లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లి వల్ల మార్కెట్‌ కమిటీకి రూ.లక్షల్లో ఆదాయం సెస్సు రూపంలో రావాల్సి వున్నా గ్రామాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని రాత్రిపూట తరలించి సెస్సుకు ఎగనామం పెడుతున్నారు. దీనివల్ల రూ.లక్షల్లో సెస్సు ఆదాయాన్ని మార్కెట్‌ కమిటీ పొందలేకపోతుంది. వ్యాపారుల సిండికేట్‌ను నిరోధించి కర్నూలు మార్కెట్‌ యార్డుపై రైతుల్లో నమ్మకాన్ని పొందేలా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోలేకపోవడం దారుణం.


సిండికేట్‌ వ్యాపారాన్ని అరికట్టండి

కర్నూలు మార్కెట్‌ యార్డుల పెద్ద ఎత్తున ఉల్లి రైతులకు నష్టం జరుగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటానికి రూ.700 కూడా చాలా మంది రైతులకు దక్కడం లేదు. టెండరు విధానాన్ని అమలులోకి తెచ్చామని రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న అధికారుల మాటలు నీటి మూటలవుతున్నాయి. 30 మంది వ్యాపారులు ఉంటే.. కేవలం ఐదుగురు మాత్రమే టెండరులో పాల్గొంటున్నారు. మార్కెట్‌యార్డులో ధర గిట్టుబాటు గాక రైతులు తమ గ్రామాలకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటే కర్నూలు మార్కెట్‌ యార్డు వల్ల రైతులకు ప్రయోజనం ఉందా? అధికారులు ఆలోచించాలి

గిట్టుబాటు ధర అందిస్తున్నాం

- రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి


రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధిక వర్షాల వల్ల ఉల్లి నాణ్యత పడిపోతోంది. నాణ్యత లేని కారణంగా వ్యాపారులు అధిక ధరను వ్యాపారులు రైతులకు అందించలేకపోతున్నారు. కనిష్ఠ ధర రూ.200-300 మాత్రమే ఉందని, అయితే.. పూర్తిగా డ్యామేజీ కావడంతోనే ఆ ఉల్లికి ధర ఎక్కువ రావడం లేదు. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లికి కర్నూలు మార్కెట్‌ యార్డులో మంచి ధర లభిస్తోంది. గరిష్ఠ ధర నాణ్యమైన ఉల్లికి క్వింటానికి రూ.4వేలకు పైగానే వస్తుంది. ఉల్లి టెండరులో వ్యాపారులంతా పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం. మార్కెట్‌ కమిటీ పరిధిలో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా వ్యాపారులు పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ఉల్లి నుంచి సెస్సును వసూలు చేస్తున్నాం. ఎక్కడా సెస్సు ఆదాయానికి గండి పడడం లేదు.

- జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ, కర్నూలు మార్కెట్‌ యార్డు

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Sep 29 , 2024 | 10:40 AM