గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 29 , 2024 | 12:17 AM
గ్రామాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు సూచించారు.
నందికొట్కూరు రూరల్, ఆగస్టు 28: గ్రామాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు సూచించారు. నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు. వివిధ శాఖల అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని సమస్యల గురించి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొణిదెల సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ గ్రామంలో ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఐదు కేంద్రాల్లో అద్దె భవనంలో ఉన్నాయని చెప్పారు. అలాగే వడ్డెమాను, కోనేటమ్మపల్లి గ్రామ సర్పంచ్లు కూడా ఇదే సమస్యను లేవనెత్తారు. దీనిపై ఎమ్మెల్యే జయసూర్య ఐసీడీఎస్ సీడీపీవో కోటేశ్వరమ్మను వివరణ కోరారు. నందికొట్కూరు పట్టణంలో 32 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో 40 అంగన్వాడీ సెంటర్లు ఉంటే అందులో కూడా దాదాపు 15 సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయని చెప్పారు. పట్టణంలో స్థల సమస్య ఉందని చెబుతున్నారని, అయితే గ్రామాల్లో అద్దె భవనాల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరగా పూర్తి చేయాలని, లేని వాటికి స్థల సేకరణలో చొరవ చూపాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని గ్రామ సర్పచులు తెలిపారు. ఎంపీడీవో శోభారాణి, తహసీల్దార్ శ్రీనివాసులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.