రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి: కలెక్టర్
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:41 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల కల్చరల్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గుర్తించిన 23 బ్లాక్ స్పాట్లో ఎలాంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ఆరా తీసారు. శాంతిరాం మెడికల్ కాలేజీ, చాబోలు, కుందూ బ్రిడ్జి, బొగ్గులైన్ తదితర బ్లాక్‌స్పాట్‌లలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, ఎలిమినేషన్, గుర్తింపు సూచికల బోర్డులు, జిగ్‌జాగ్ బారికేడింగ్ తదితర పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఏడు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాద ఘటికల ప్రదేశాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందింన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో బారికేడ్స్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 1033 హెల్ప్‌లైన్ బోర్డులు, ఎస్‌ఎస్‌వో బటన్ నొక్కడం, ప్రతి టోల్‌ప్లాజాలో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ప్రధాన రహదారిలో ఇరువైపుల ఉన్న చెట్లపొదలను తొలగించడంతో పాటు స్పీడ్ బ్రేకర్ల ముందు, వెనుక భాగాల్లో పెయింటింగ్ వేయాలన్నారు. జిల్లాలో ఉన్న నలుగురు డీఎస్పీలు రోడ్డు ప్రమాదాలకు సంబందించి హిట్, రన్‌కేసుల బాధితులకు పరిహారం చెల్లింపుపై ఆర్డీవోలతో సమన్వయం చేసుకొని నివేదికలు ఇవ్వాలన్నారు.
‘హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి’
ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి సంక్షేమ అధికారలు, ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 37 ఎస్సీ, బీసీ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్ పరికరాలు, మస్కిటో నెట్‌లు, తలుపులు, మరమ్మతులు, పై కప్పు లీకేజీ, ఫ్లోరింగ్, ప్రహారీ తదితర పనులకు ప్రభుత్వం రూ.8.29 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. సమస్యలను గుర్తించి ఎస్టిమేట్లు తయారు చేసి పరిపాలన ఉత్తర్వులు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో సంబంధిత పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించి జనవరిలో పనులు ప్రారంభించాలన్నారు. ఫిబ్రవరి నెలాఖరిలోపు పూర్తి చేసిన పనులన్నింటికి మార్చి 1లోపు బిల్లులు సమర్పించాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీడబ్ల్యూఐడీసీ, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్, సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్లు వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.