గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:54 PM
పక్కా గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య అన్నారు.
చాగలమర్రి, సెప్టెంబరు 4: పక్కా గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య అన్నారు. బుధవారం చాగలమర్రిలోని నారాయణపల్లె రహదారిలోగల లేఔట్‌లలో నిర్మించుకున్న పక్కా గృహాలను పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బేస్‌మెట్ వేసుకున్న వారు డిసెంబరు 24వ తేదీ లోపు గృహాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. చాగలమర్రి మండలంలో 2,316 గృహాలు మంజూరుకాగా 733 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. లబ్ధిదారులకు 90 రోజులపాటు ఉపాధి పని దినాలు కల్పించాలని అన్నారు. 298 గృహ లబ్ధిదారులకు ఉపాధి పని దినాలు కల్పించలేదని ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.42 లక్షల పని దినాలకు గాను 69 వేల పని దినాలు మాత్రమే కల్పించారని, మిగిలిన పని దినాలు వేగవంతం చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. లేఔట్‌లలో విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు పీడీతో మొరపెట్టుకున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఆయా శాఖల అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ ఈఈ హరిగోపాల్, డీఈ నాగరాజు, ఏఈ షఫివుల్లా, ఏపీవో నిర్మల, హౌసింగ్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.