Share News

క్రీడా దినోత్సవం

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:57 AM

నంద్యాల పట్టణంలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 క్రీడా దినోత్సవం
నంద్యాలలో ర్యాలీలో పాల్గొన్న డాక్టర్‌ రవికృష్ణ్డ, ఎన్‌ఎండీ ఫిరోజ్‌

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 29: నంద్యాల పట్టణంలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపనున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్రీడా భారతి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. క్రీడా భారతి అధ్యక్షుడు నిమ్మకాయల సుధాకర్‌ అధ్యక్షతన 3కే రన్‌ కార్యక్రమం నిర్వహించారు. క్రీడా భారతి రాయలసీమ జోనల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ,శాంతి నికేతన్‌ విద్యా సంస్థల చైర్మన్‌, క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడు సూర్యదేవర సుధాకర్‌, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని ఎన్‌ఎండీ ఫిరోజ్‌ వెలిగించగా 3కే రన్‌ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన నంద్యాల క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్పోర్ట్స్‌ అఽథారిటీ జిల్లా అధికారి రాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, జిల్లా ఒలింపిక్స్‌ సంఘం మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రవికృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు, కళాశాల పాఠ శాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక టెక్కె మార్కెట్‌ యార్డు నుంచి పద్మావతి నగర్‌లోని ఇండోర్‌ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది.

జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లాలోని అంబేడ్కర్‌ గురుకులంలో క్రీడా దినోత్సవం, తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ‘చదువు మా బాధ్యత, ఆటలు మా హక్కు’ అని తెలుగులో మాట్లాడే పోటీ, క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులతో పిరమిడ్‌ విన్యాసాలు వేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మూర్తి, పీడీ విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: క్రీడలపై విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాషా, టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగూర్‌ఖాన్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ పస్పీల్‌ మున్నా పేర్కొన్నారు. ఈమేరకు గురువారం హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని స్థానిక కేవీకే స్టేడియం ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని వారు ప్రారంభించారు. నాయకులు నూర్‌బేగ్‌, జునీద్‌బాషా, రవీంద్రబాబు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శివకుమార్‌ తదితరులు ఉన్నారు.

జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు గురువారం పలు క్రీడాపోటీలను నిర్వహించారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్‌ జిష్ణు నాగ్‌ విజయ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మావతిబాయి, అధ్యాపకులు బహుమతులు ప్రదానం చేశారు.

గడివేముల: మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరిమద్దెల హైస్కూల్‌, కేజీబీవీ, బిలకలగూడురు ఎంపీయూపీ, స్పెషల్‌ స్కూల్‌, బుజనూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, గడివేముల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు జిందాల్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఎంఈవో విమల వసుంధరాదేవి, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు విక్టర్‌ ఇమ్మానుయేలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:57 AM