Share News

‘డ్రోన్‌తో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ’

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:09 AM

డ్రోన్‌ వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే అవకాశం ఉంటుందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం జాన్సన్‌ అన్నారు.

‘డ్రోన్‌తో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ’
డ్రోన్‌ను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 6: డ్రోన్‌ వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే అవకాశం ఉంటుందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం జాన్సన్‌ అన్నారు. శుక్రవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శిక్షణ, సందర్శన (టీ అండ్‌ వీ) సమావేశాన్ని నిర్వహించారు. ఏడీఆర్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, పంటల స్థితిగతులు, వర్షపాతం వివరాలు, తదితర అంశాలపై విశదీకరించారు. నంద్యాల జిల్లాలో ఆగస్టు నెలాఖరుకు 322 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 450.40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లో కొత్తపల్లె, పాములపాడు మండలాల్లో మొక్కజొన్న, పత్తి, వరి, మినుము పంటలు ముంపుకు గురయ్యాయని ఆయన తెలిపారు. ముం పునకు గురైన పంటల్లో శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన విధంగా యాజమాన్య పద్ధతులను రైతులు అనుసరించాలని అన్నారు. వర్షాల ప్రభావంతో పంటలపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందన్నారు.

‘కోల్పోయిన పోషకాలను తిరిగి అందించాలి’

భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న, మిరప, పత్తి పంటల్లో 30 కేజీల యూరియా, పది కేజీల పొటాష్‌ ఎరువులను పైపాటుగా అందించినట్లైతే మొక్క కోల్పోయిన పోషకాలను తిరిగి అందించవచ్చని నంద్యాల జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ, కర్నూలు జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి అన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 ఎరువు ను 200 గ్రాములను ఎకరాకు పిచికారీ చేయాలని, దీంతో పాటు ఫార్ములా -4 సూక్ష్మపోషకాల ఎరువును 2.5 గ్రాములను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పత్తి పంటలో పూత రాలిపోతే కొత్త పూత కోసం ప్లానో ఫిక్స్‌ 2.5 ఎంఎల్‌ ఎకరాకు పిచికారీ చేయాలన్నారు. అధిక వర్షాల వల్ల వచ్చే బూడిద తెగుళ్లు, కాయకుళ్లు, వివిధ రకాల తెగుళ్ళకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌/ రెడోనిల్‌ 3 గ్రాములు లీటర్‌ నీటికి లేదా 600 గ్రాములు ఎకరాకు పిచికారి చేయాలని సూచించారు. కర్నూలు జిల్లాకు పెద్దగా వర్ష ప్రభావం లేదని డీఏవో వరలక్ష్మి పేర్కొన్నారు. రబీలో సాగు చేసేందుకు వీలుగా శనగలో కొత్త రకాలైన ఎన్‌బీఈజీ -776, ఎన్‌బీఈజీ -452, ఎన్‌బీఈజీ -857 రకాలు ఆర్‌ఏఆర్‌ఎస్‌లో విత్తనాలను అందుబాటులో ఉన్నాయని, రైతులు సంప్రదించాలని ఏడీఆర్‌ తెలిపారు. టీ అండ్‌ వీ సమావేశం అనంతరం డ్రోన్‌ ద్వారా పురుగు మందుల పిచికారీ విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, నంద్యాల, కర్నూలు జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:09 AM