Share News

Land Allocation : ఆస్పత్రి కోసం స్థలం..17 అంతస్థుల భవనం!

ABN , Publish Date - Dec 10 , 2024 | 06:09 AM

విశాఖపట్నంలోని సీతమ్మధార నార్త్‌ ఎక్సటెన్షన్‌ వుడా లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం కొంత భూమి వదిలారు. అందులో రెండు ఆస్పత్రుల నిర్మాణానికి వేర్వేరుగా వుడా భూమి కేటాయించింది.

Land Allocation : ఆస్పత్రి కోసం స్థలం..17 అంతస్థుల భవనం!

  • వైసీపీ హయాంలో అడ్డగోలుగా ‘వాణిజ్య’ అనుమతులు

  • తాడేపల్లిలో చక్రం తిప్పిన పెద్దలు

  • 3 దశాబ్దాల కిందట ఆ భూమికి చెల్లించింది రూ.8.75 లక్షలు

  • ప్రస్తుత విలువ సుమారు రూ.85 కోట్లు

ఆస్పత్రి నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఓ సంస్థ ముందుకొస్తే మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం విశాఖలో ఎకరా స్థలం కేటాయించింది. వైసీపీ అధికారంలోకి రాగానే అదే స్థలంలో ఆస్పత్రికి బదులు 17 అంతస్థుల వాణిజ్య భవనం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది. ఆ భూమిని అప్పట్లో రూ.8.75 లక్షలకు కొనుగోలు చేయగా, అదే భూమి ఇప్పుడు సుమారు రూ.85 కోట్లు పలుకుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినందుకు తాడేపల్లి పెద్దలకు రూ.కోట్లలో ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలోని సీతమ్మధార నార్త్‌ ఎక్సటెన్షన్‌ వుడా లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం కొంత భూమి వదిలారు. అందులో రెండు ఆస్పత్రుల నిర్మాణానికి వేర్వేరుగా వుడా భూమి కేటాయించింది. ప్లాట్‌ నంబర్‌-1లో ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌కి 4,450 చ.గజాలు, రాజీవన్‌ హాస్పిటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 4,374 చ.గజాలను గజం రూ.200 చొప్పున 1988 ఏప్రిల్‌ 4న వుడా కేటాయించింది. రాజీవన్‌ ఈ భూమి కోసం వుడాకు రూ.8,74,800 చెల్లించింది. నర్సింగ్‌ హోమ్‌ నిర్మాణానికి దానికి వుడా పలు నిబంధనలు విధించింది. నర్సింగ్‌ హోమ్‌ నిర్మాణం రెండేళ్లలో పూర్తిచేయాలని.. పేదలకు 20 శాతం బెడ్లు కేటాయించి ఉచిత వైద్య సేవలు అందించాలని పేర్కొంది. కేటాయించిన భూమిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదని.. రెసిడెన్షియల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కోసం 300 గజాల స్థలంలో 1,500 చ.అ. విస్తీర్ణంలో మాత్రమే నివాస భవనం నిర్మించుకోవచ్చని.. అంతకు మించి నిర్మాణం ఉండకూడదని స్పష్టంచేసింది. ఆ భూమిని అమ్మకూడదు.. బదిలీ చేయకూడదు. విభజించకూడదు.. తనఖా పెట్టకూడదని కూడా నిబంధన విధించింది.


ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ ఆ స్థలంలో భారీ ఆస్పత్రి నిర్మించి నిర్వహిస్తుండగా.. రాజీవన్‌ సంస్థ మాత్రం నర్సింగ్‌ హోమ్‌ నిర్మించలేదు. రకరకాల ప్రయోజాలకు ఆ భూమిని వినియోగించుకుంటూ వచ్చింది. అక్కడ కొద్దికాలం పాఠశాల కూడా నడిపారు. కొన్నేళ్ల క్రితం ఆ భూమిలో కొంత పవన్‌పుత్ర హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసె్‌సకు, పరసరాజ్‌ రాపా హాస్పిటల్స్‌కు వాటాలు ఇచ్చారు. దీనికోసం హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

  • ఆస్పత్రి గిట్టుబాటు కాదని..

జగన్‌ ప్రభుత్వం వచ్చాక.. ఆ భూమిలో ఆస్పత్రి నిర్వహణ లాభదాయం కాదని, దానిని మూడు సంస్థలు కలిసి అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, రెసిడెన్షియల్‌ కమ్‌ కమర్షియల్‌ భవనం నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వాలని కోరుతూ వీఎంఆర్‌డీఏ (పాత వుడా)కి 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేశారు. దీనిని ఆనుకునే ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి అద్భుతంగా లాభాల్లో నడుస్తుంటే.. వీఎంఆర్‌డీఏ అధికారులు కళ్లు మూసుకుని కేవలం 20 రోజుల్లో ఎన్‌వోసీ ఇచ్చేశారు. ‘మీరు ఆ భూమిలో ఏమైనా నిర్మించుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు’ అని అనుమతులు మంజూరు చేశారు. సాధారణంగా ఇలా రాయితీ ధరపై కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకుంటే ప్రభుత్వానికి నివేదించి.. అక్కడినుంచి అనుమతితీసుకోవాలి. ఒక్కోసారి ఇలాంటి విషయాలపై మంత్రివర్గ సమావేశంలో పెట్టి కూడా నిర్ణయం తీసుకుంటారు. కానీ వీఎంఆర్‌డీఏ అధికారులు స్టాండింగ్‌ కౌన్సిల్‌ అభిప్రాయం తీసుకుని.. ఎవరి అభ్యంతరాలు లేవంటూ సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. ఈ క్రమంలో అప్పటి స్థానిక వైసీపీ నాయకులకు, తాడేపల్లి పెద్దలకు కోట్లలో ముడుపులు అందాయనేది ఆరోపణ.


  • ఏడాది క్రితం జీవీఎంసీ అనుమతులు

వీఎంఆర్‌డీఏ 2020 ఫిబ్రవరిలో ఎన్‌వోసీ ఇవ్వగా రాజీవన్‌ అండ్‌ కో మూడేళ్లకు .. 2023 ఫిబ్రవరిలో జీవీఎంసీకి భవన నిర్మాణానికి దరఖాస్తు చేశారు. ఆ ఏడాది నవంబరులో 17 అంతస్థుల భవన నిర్మాణానికి కార్పొరేషన్‌ అనుమతి ఇచ్చింది. అందులో ఒక ఫ్లోర్‌ కమర్షియల్‌కు, మరో రెండు. .సెల్లార్లుగా (పార్కింగ్‌ నిమిత్తం) చూపించారు ఆస్పత్రికి కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్‌/కమర్షియల్‌ భవనం ఎలా నిర్మిస్తారని ఎవరూ ప్రశ్నించలేదు. అక్కడ కూడా వైసీపీ పెద్దలు చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ ఏరియాలో గజం స్థలం రూ.1.5 లక్షల నుంచి రూ.1.75 లక్షలు పలుకుతోంది. ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.85 కోట్లు. భూమి విలువ వేయి రెట్లు పెరిగింది.

  • ఎమ్మెల్యే విష్ణు ఫిర్యాదు

ఈ భూమి విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఇంటికి 50 అడుగుల దూరంలోనే ఉంది. అందులో భారీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడంతో సీనియర్‌ సిటిజన్లు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే....జిల్లా కలెక్టర్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌, జీవీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. ఈభూమికి సేల్‌డీడ్‌ ప్రకారం బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చారని,అయితే వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అక్కడ రహదారులు లేవని ఆయన తెలిపారు. ఈ భవనం కోసం మాస్టర్‌ ప్లాన్‌ను కూడా వైసీపీ నేతలు మార్చేశారని ఫిర్యాదు చేశారు.

  • విచారణ చేస్తున్నాం

ఆ భూమిలో నిర్మిస్తున్న భవనానికి ఇచ్చిన అనుమతులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేసిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. నిబంధనల ఉల్లంఘనను పరిశీలిస్తున్నామని.. 2-3 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు.

Updated Date - Dec 10 , 2024 | 06:09 AM