TDP-JSP: గోరంట్ల సీటు సేఫ్.. చంద్రబాబును కలిసొచ్చినా అసంతృప్తిలోనే మరో కీలకనేత!
ABN , Publish Date - Feb 26 , 2024 | 03:19 AM
AP Elections 2024: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది..
రూరల్ బుచ్చయ్యకే.. ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
జనసేన నేత కందుల దుర్గేశ్‌తో కూడా..?
సీనియర్లను నివాసానికి పిలిపించి మంతనాలు..
గంటాతో చీపురుపల్లి సీటుపైనే చర్చ
భీమిలిపై మాజీ మంత్రి ఆసక్తి..
ఆలపాటికి ఏదో ఒక చాన్సు!
బాబు నిర్ణయం శిరోధార్యం: దేవినేని
అధినేతను కలిసి వచ్చినా అసంతృప్తిలోనే పీలా
జనసేన సీట్లపై స్పష్టత!
పిఠాపురం, అమలాపురం, భీమవరం, నరసాపురం, నిడదవోలు ఓకే
పోలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, యలమంచిలి, పాలకొండ కూడా!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Gorantla butchaiah chowdary) రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. పార్టీలో అత్యంత సీనియర్ అయిన ఆయన పేరు శనివారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో లేకపోవడం కలకలం రేపింది. అదే సీటును జనసేన నేత కందుల దుర్గేశ్ కూడా ఆశిస్తుండడంతో కొంత ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆదివారమిక్కడ తన నివాసం నుంచి బుచ్చయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ఖాయంగా అవకాశం లభిస్తుందని, ఆందోళన చెందవద్దని సముదాయించారు. జనసేన నేతలతో కూడా మాట్లాడుతున్నానని, ఒకట్రెండు రోజుల్లో అక్కడే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటిస్తామని భరోసా ఇచ్చారు. బుచ్చయ్య ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దుర్గేశ్‌తో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మరో సీట్లో సర్దుబాటు చేసుకోవాలని కోరగా ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఇతరత్రా అవకాశాలిస్తా..
తొలి జాబితాలో పేర్లు రాని కొందరు సీనియర్లను చంద్రబాబు ఆదివారమిక్కడ తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీపరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. వారిలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (తెనాలి), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తరం), మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ (విశాఖ దక్షిణ), పీలా గోవింద్ (అనకాపల్లి), రాజానగరం ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ, రైల్వే కోడూరు పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి తదితరులు ఉన్నారు. గంటాతో భేటీలో చీపురుపల్లి స్థానంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ చేస్తే విజయావకాశాలు బాగుంటాయని సర్వే నివేదికలు వస్తున్నాయని, అక్కడ బరిలో దిగాలని చంద్రబాబు సూచించారు. అయితే తనకు భీమిలిపై ఆసక్తి ఉందని, అది కాకపోయినా విశాఖ జిల్లాలో ఎక్కడ అవకాశమిచ్చినా పోటీ చేస్తానని గంటా చెప్పారు. తాను విశాఖ నివాసినని, వేరే జిల్లాలో పోటీ చేయడం తనకు ఇబ్బందని కూడా అన్నారు. ఎక్కడ నిలపాలో తాను నిర్ణయం తీసుకుంటానని, అది తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు తనకు చెప్పారని గంటా ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. తన మైలవరం సీటుపై దేవినేని ఉమ ముప్పావు గంట అధినేతతో చర్చించారు. అక్కడి సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
‘ఒక్కో చోట ఒక్కో రకమైన సమీకరణలు ఉంటాయి. విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. నీ శ్రమ నాకు తెలుసు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరించు. నిన్ను ఎలా సర్దుబాటు చేయాలో నేను చూసుకుంటాను’ అని చంద్రబాబు ఉమతో అన్నారు. చంద్రబాబు కుటుంబానికి తాను సైనికుడి వంటివాడినని, ఆయన మాట తనకు శిరోధార్యమని బయటకు వచ్చిన తర్వాత దేవినేని వ్యాఖ్యానించారు. జనసేనతో పొత్తు వల్ల తెనాలి సీటు ఇవ్వలేకపోతున్నామని మాజీ మంత్రి ఆలపాటికి చంద్రబాబు చెప్పారు. మరెక్కడైనా సర్దుబాటు చేసే వీలుంటే ప్రయత్నం చేస్తానని.. కుదరకపోతే ఆ తర్వాతైనా ఏదో ఒక అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ తనకు సంతృప్తి కలిగించిందని రాజా తర్వాత విలేకరులతో చెప్పారు. కాగా.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ను తీసుకుని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయన్ను కలిసి వచ్చిన తర్వాత కూడా గోవింద్ అసంతృప్తిగానే కనిపించారు. ఇంకోవైపు.. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లకపోతే దానికి బొడ్డు వెంకటరమణ పేరు పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు తన పేరు పరిశీలించాలని రూపానందరెడ్డి అధినేతను కోరారు.