Liquor Traders : ఇలాగైతే వ్యాపారం ఎలా?
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:41 AM
మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడంలేదని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగమే మార్జిన్(లాభం) వస్తోందని గగ్గోలు పెడుతున్నారు.
ప్రభుత్వం చెప్పినదాంట్లో సగమే వస్తోంది
ప్రభుత్వ పెద్దలను కలవాలని మద్యం లైసెన్సీల నిర్ణయం
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడంలేదని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగమే మార్జిన్(లాభం) వస్తోందని గగ్గోలు పెడుతున్నారు. 20శాతం మార్జిన్ ఇస్తామని మద్యం పాలసీలో ప్రభుత్వం పేర్కొనగా, లైసెన్సీలకు 11శాతమే చేతికి అందుతోందని చెబుతున్నారు. వైన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయల సుబ్బారావు నేతృత్వంలో మద్యం లైసెన్సీలు సోమవారం విజయవాడలో సమావేశమయ్యారు. ఎక్సైజ్ స్టేషన్‌కు ఒకరు చొప్పున 200 మంది లైసెన్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు వ్యాపారులు మాట్లాడుతూ.. ఇష్యూ ప్రైస్‌పై 20శాతం మార్జిన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇష్యూ ప్రైస్ అనేదానికి అర్థం మార్చేసిందన్నారు. ఇష్యూ ప్రైస్ అంటే అందులో తమకు ఇచ్చే మార్జిన్ తప్ప అన్ని రకాల పన్నులు ఉండేవని, కానీ ఇప్పుడు కీలకమైన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ)ని కలపకుండా ఇష్యూ ప్రైస్ అంటున్నారని వాపోయారు. దీంతోపాటు టీసీఎస్, రౌండ్ ఆఫ్, డ్రగ్ కంట్రోల్ సెస్ కూడా ఇష్యూ ప్రైస్ అనంతరం విధిస్తున్నారన్నారు.
ఆ నాలుగు రకాల పన్నుల్లో లైసెన్సీలకు వాటా రావట్లేదని, ఫలితంగా మార్జిన్ 11శాతానికి పడిపోయిందని తెలిపారు. ఇలాగైతే వ్యాపారం ఎలా చేయగలమని ప్రశ్నించారు. దీనిపై కోర్టుకు వెళ్దామని కొందరు లైసెన్సీలు అనగా, తొలుత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మరికొందరు అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే భారీగా లైసెన్స్ ఫీజులు పెంచారు. మార్జిన్ 20శాతం చేసినందున లైసెన్స్ ఫీజులు పెంచి ఉంటారని వ్యాపారులు భావించి షాపులు దక్కించుకున్నారు. తీరా చెప్పినదాంట్లో సగమే వస్తుండటంతో ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.