Weather Forecast : బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Dec 08 , 2024 | 05:07 AM
ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.
నేటికి బలపడే అవకాశం..
దక్షిణ కోస్తా, సీమలో వర్షాలు
11 నుంచి మరింత పెరిగే చాన్స్
విశాఖపట్నం, డిసెంబరు 8: ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారానికి బలపడనుంది. ఆ తర్వాతా అదే దిశలో పయనించి ఈనెల 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి, శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో ఈనెల 11వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. కాగా, శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో చలి స్వల్పంగా పెరిగింది. కళింగపట్నంలో 20.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.