Share News

Madanapalle Fire Accident: కావాలనే కాల్చేశారు..

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:52 AM

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది.

Madanapalle Fire Accident: కావాలనే కాల్చేశారు..
Fire Accident

మంటల్లో ‘మదనపల్లె ఫైల్స్‌’

నాడు పక్కా పథకం ప్రకారమే సబ్‌ కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పు

మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి, ఆర్డీవో హరిప్రసాద్‌ అవినీతిలో మునిగి పోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్‌ చేశారు. అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్‌ కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పుపెట్టారు. పెద్దిరెడ్డి పీఏ తుకారామ్‌, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, మాజీ ఆర్డీవో మురళి ఆదేశాల మేరకు సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌ ఈ కుట్రను అమలు చేశారు.

- రెవెన్యూ శాఖ

భూ అక్రమాలను సమాధి చేసేందుకే

అడ్డగోలుగా పెద్దిరెడ్డి మనుషుల అసైన్డ్‌ భూముల దోపిడీ

అవినీతిలో మునిగి తేలిన ‘రెవెన్యూ’

మదనపల్లె ఆర్డీవో, మాజీ ఆర్డీవో అండ

ఫైళ్లు తారుమారు.. కుట్రతో నిప్పు

పెద్దిరెడ్డి పీఏ, అనుచరుడి పాత్ర

రెవెన్యూ శాఖ అభియోగాలు నమోదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ అక్రమాలను సమాధి చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు దహనం కేసులో రెవెన్యూ శాఖ పలు అభియోగాలు నమోదు చేసింది. మదనపల్లె మాజీ ఆర్డీవో ఎస్‌.మురళి, ఆర్డీవో సి.హరిప్రసాద్‌ (ఘటన జరిగినపుడు), సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌పై తీవ్ర అభియోగాలు మోపింది. వాటిపై పది రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానం (డిఫెన్స్‌ స్టేట్‌మెంట్‌) ఇవ్వాలని ఆదేశిస్తూ గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను పరిశీలిస్తే మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ఎవరి పాత్ర ఏమిటి? తెరవెనక ఏం జరిగిందన్నది సిసోడియా స్పష్టంగా బయటపెట్టారు.

ఇవీ అభియోగాలు

‘రాష్ట్రంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ చాలా పెద్దది. రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై విలువైన అసైన్డ్‌ భూములను చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగించారు. ఆ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడంలో అవినీతి, అక్రమాలు జరిగాయి. మాజీ ఆర్డీవో మురళి, ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌ అవినీతిలో మునిగిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి లంచాలు తీసుకున్నారు. ఈ అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌ ప్రకారమే సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పుపెట్టారు. అక్కడ జరిగింది అగ్నిప్రమాదం కానేకాదు. అదో నేరపూరితమైన కుట్ర. మాజీ ఆర్డీవో మురళి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారామ్‌, పెద్దిరెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి ఆదేశాల మేరకే సీనియర్‌ అసిస్టెంట్‌ ఈ కుట్రను అమలు చేశారు. మిగతా విషయాలు సీఐడీ విచారణలో తేలాల్సి ఉంది’ అని రెవెన్యూ శాఖ పేర్కొంది.

gh.jpg

10 రోజులు గడువు

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు తగలబెట్టిన తర్వాత సిసోడియా అక్కడికి వెళ్లారు. నాలుగు రోజులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం సీఐడీ విచార ణకు ఆదేశించింది. ఆ వెంటనే నాటి ఆర్డీవో హరిప్రసాద్‌, మాజీ ఆర్డీవో మురళి, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇప్పుడు వారిపై అభియోగాలు మోపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజుల్లోగా ప్రభుత్వానికి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంది. వారిచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం మదనపల్లె ఉదంతంలో ఎవరిపాత్రేమిటో సిసోడియా స్పష్టంగా పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే...

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసులో జూలై 21వ తేదీ రాత్రి 11:30 గంటలకు అగ్గిరాజుకుంది. ఆఫీసులో అసైన్డ్‌ భూములు, చుక్కల భూములున్న విభాగంలోనే 2,440 ఫైళ్లు కాలిపోయాయి. సంఘటన జరిగిన 17 నిమిషాల్లో ఫైర్‌ఇంజన్‌లు వచ్చి మంటలు ఆర్పాయి. ఆ తర్వాత మంటల నుంచి 700 ఫైళ్లు బయటకు తీశారు. అందులో కొన్ని పాక్షికంగా కాలిపోయాయి. ఈ సంఘటన కూటమి సర్కారు వచ్చిన కొత్తలో జరగడంతో అలజడి రేగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఉదంతంపై సీఐడీ విచారణ చేస్తోంది. తొలుత ఇది అగ్నిప్రమాదమని అనుకున్నారు. కానీ అది కుట్ర అని తేలింది.


రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించిన అంశాలు

మదనపల్లె డివిజన్‌లో 79,107 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఫ్రీ హోల్డ్‌ చేయాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. కలెక్టర్‌ 74,374 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేశారు. 4,732 ఎకరాల ఫ్రీ హోల్డ్‌ ప్రతిపాదనలను తిరస్కరించారు. వీటిని పరిశీలిస్తే.. భారీగా భూములను అక్రమంగా నిషేధిత జాబితా నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్‌ చేసేలా తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో చాలా వరకు 2003 తర్వాత అసైన్డ్‌ చేసినవి ఉన్నాయి. అంటే.. అవి ఫ్రీ హోల్డ్‌కు అర్హత లేనివి. మదనపల్లె ఆర్‌డీఓ ఇలాంటి అనేకానేక అక్రమ ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపించారు. ఈ అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే నిప్పు కుట్రకు పాల్పడ్డారు.

సబ్‌కలెక్టర్‌ ఆఫీసులో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం జరగలేదు. నేరపూరిత కుట్రలో భాగంగా జరిగిన ఘటన. ఇది బయటి వ్యక్తులు చేసిన పనిగా కనిపించడం లేదు.

కీలక రికార్డులున్న ఆఫీసులో సీసీ కెమెరాలు పని చేయలేదు. రికార్డు రూమ్‌లోకి ఇంజిన్‌ ఆయిల్‌ తీసుకువచ్చారు. అక్కడే దోమల అగరబత్తీలను వెలిగించారు. దీనివల్ల మంటలు త్వరగా వ్యాపించాయి. మంటలు మరింత వేగంగా వ్యాపించేలా కొన్ని రకాల రసాయనాలను కూడా వాడారు.

భూముల ఫైళ్ల పరిష్కారంలో అక్రమాలు జరిగాయి. చుక్కల భూములు, డి.పట్టా భూములను 22(ఏ) నుంచి అడ్డగోలుగా తొలగించారు. ఆ ఆధారాలను ధ్వంసం చేసేందుకు కుట్రకు పాల్పడ్డారు. ఆధారాలను పరిశీలిస్తే... సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ కుట్రను అమలు చేసినట్లుగా ఉంది.


మాజీ ఆర్‌డీవో మురళి నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారు. భూములకు సంబంధించి అనేక తప్పుడు నివేదికలు తయారు చేశారు. కీలకమైన భూములను 22(ఏ) నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు అందించడానికి తప్పుడు రిపోర్టులు సృష్టించి, ఫోర్జరీ సంతకాలు చేశారు. ఇలా భారీగా భూములు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లేలా చేశారు.

ఆర్డీవో హరిప్రసాద్‌ నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. భూముల కేసుల్లో అవినీతికి పాల్పడటం, ఆఫీసు వ్యవహారాల్లో బాధ్యత గా వ్యవహరించకపోవడం వంటివి జరిగాయి. ఆఫీసు పరిధిలో 7 సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోలేదు. ఇదీ తీవ్రమైన అంశమే.

సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ నేర పూరిత కుట్రలో పాల్గొనడంతో పాటు సంతకాల ఫోర్జరీ, తప్పుడు రికార్డుల తయారీలో భాగస్వామి అయ్యారు. కీలక రికార్డులున్న గదిలోకి మంటలను త్వరగా వ్యాపింప చేసే ఇంజిన్‌ ఆయిల్‌ తీసుకొచ్చి పెట్టారు. రికార్డ్‌ రూమ్‌లో దోమల నివారణ స్టిక్‌లను వెలిగించి వెళ్లిపోయారు.

పెద్దిరెడ్డి మనుషులు అక్రమ పద్ధతుల్లో భూముల ఫైళ్లు సెటిల్‌ చేయించుకునేందుకు ఆర్‌డీవో, ఇతర అధికారులను అవినీతిలో ముంచెత్తారు. దీంతో నోట్‌ఫైల్స్‌ను మార్చేశారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించారు.

మురళి మదనపల్లె ఆర్‌డీఓగా ఉన్నప్పుడు, బదిలీ అయిన తర్వాతా పెద్దిరెడ్డి మనుషులతో ప్రైవేటు భేటీలు నిర్వహించారు. రహస్యమైన ప్రభుత్వ సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు చేరవేశారు. తప్పుడు రికార్డులు సృష్టించారు. ఫోర్జరీ సంతకాలు చేయించారు. తన కింది ఉద్యోగులను కూడా తనలాగే తప్పుడు బాటలో నడవాలని ఆదేశించారు.

Updated Date - Nov 15 , 2024 | 08:32 AM