AP Politics: షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లోకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ABN , Publish Date - Jan 21 , 2024 | 03:06 PM
ఏపీలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్ షర్మిల సాదరంగా ఆయనను ఆహ్వానించారు. తనతోపాటు శెట్టి గంగాధర్, మరి కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ కార్యక్రమానికి ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ క్రమంలో ఏఐసీసీ ఇచ్చిన తీర్మానాన్ని గిడుగు రుద్రరాజు చదివి వినిపించారు. నేతలు, కార్యకర్తల హర్ష ధ్వానాల మధ్య షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన గిడుగు రుద్రరాజుకు షర్మిల ఆర్డర్ కాపీని అందజేయగా..ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు షర్మిలకు అభినందనలు తెలియజేశారు.
టీడీపీ, వైసీపీ పాలనలో విసుగు చెందిన అనేక మంది ప్రస్తుతం కాంగ్రెస్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అంతేకాదు షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఒక శాతం నుంచి వంద శాతానికి తీసుకేళ్లేందుకు కృషి చేస్తామని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇక రామకృష్ణారెడ్డి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా..2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌పై విజయం సాధించారు. అయినప్పటికీ మంత్రి పదవి వస్తుందని ఆశించినా కూడా ఆయనకు దక్కలేదు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఆళ్లకు టికెట్ రాదనే కారణంతోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.