‘భూ’చోళ్ల పనిపడతాం
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:39 AM
జగన్ సర్కారు హయాంలో కబ్జాకోరులు, భూ ఆక్రమణదారులు, ల్యాండ్ మాఫియాతో అంటకాగి విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసిన రెవెన్యూ అధికారులపై కూటమి సర్కారు దృష్టి సారించింది.
రెవెన్యూ అక్రమార్కులపై త్వరలో విచారణ
జాబితాలో 18 మంది డిప్యూటీ కలెక్టర్లు 46 మంది తహసీల్దార్లు, 68 మంది సర్వేయర్లు
గత ప్రభుత్వంలో భారీగా భూ అక్రమాలు
వైసీపీ నేతలతో కుమ్మక్కు.. రికార్డుల తారుమారు
రీ సర్వే ముసుగులోనూ అడ్డగోలు వ్యవహారం
విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం
కూటమి సర్కారుకు 3 లక్షలకు పైగా ఫిర్యాదులు
నివేదికల ఆధారంగా జిల్లాలవారీగా విచారణ
ఏసీబీతోనా, విజిలెన్స్‌తోనా అన్నది త్వరలో నిర్ణయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ సర్కారు హయాంలో కబ్జాకోరులు, భూ ఆక్రమణదారులు, ల్యాండ్ మాఫియాతో అంటకాగి విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసిన రెవెన్యూ అధికారులపై కూటమి సర్కారు దృష్టి సారించింది. జిల్లాల వారీగా అందిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తోంది. ఆర్‌డీవోలుగా పనిచేసిన 18 మంది డిప్యూటీ కలెక్టర్లు, 46 మంది తహసీల్దార్లు, 68 మంది సర్వేయర్లపై ఇప్పటి దాకా వచ్చిన ఫిర్యాదులపై జిల్లాల వారీగా విచారణ చేయించనుంది. విచారణ ఏసీబీకి అప్పగిస్తారా? లేదా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇస్తారా? అన్నది త్వరలో తేలనుంది. తొలుత శాఖాపరమైన విచారణ చేయించాలనుకున్నా వెనక్కి తగ్గినట్లు తెలిసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తేనే జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ దందాల్లోని చీకటి కోణాలు బయటకు వస్తాయని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు, జిల్లాల నుంచి వచ్చే రికార్డుల పున:పరిశీలన నివేదికల ఆధారంగా విచారణను ఎవరికి అప్పగించాలన్నది నిర్ణయిస్తుందని తెలిసింది. ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్, చుక్కల భూములు, షరతుగల పట్టాలు, ఇనామ్ భూముల రికార్డులపై పున:పరిశీలన చేయిస్తోంది. ఈ నెల 17 నాటికి ఈ కార్యక్రమం పూర్తిచేయాలని రెవెన్యూ శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాల వారీగా వచ్చే నివేదికల ఆధారంగా అక్రమాలు, భూ కబ్జాలపై స్పష్టత వస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 18 మంది డిప్యూటీ కలెక్టర్లపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అందులో ఇప్పటికే ఇద్దరిని ‘మదనపల్లె ఫైల్స్’ విషయంలో సస్పెండ్ చేశారు. మరో 12 మందిపై తీవ్ర అభియోగాలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసినప్పుడు వాటిని అడ్డుకునేందుకు సరిగా చర్యలు తీసుకోకపోవడం... ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇచ్చినప్పుడు తిరిగి అప్పీలు చేయకపోవడం... ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన రెవెన్యూ రికార్డులను ఆర్కైవ్స్‌లో ఉన్న వాటితో సరిపోల్చకుండా అవే సరైనవని నిర్ధారించడం వంటి తీవ్రమైన తప్పిదాలకు పాల్పడినవారు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఓ అధికారి గతంలో విశాఖ జిల్లా భీమిలిలో తహసీల్దార్‌గా పనిచేశారు. ఆ సమయంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. కోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అది ప్రభుత్వ భూమి అని నిరూపించే ఆధారాలు, డాక్యుమెంట్లు ఉన్నా వాటిని ప్రభుత్వం తరఫున కేసు వాదించిన న్యాయవాదికి అందించలేదని తాజాగా గుర్తించారు. అంతేగాక హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా ప్రైవే టు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారని తేల్చారు. ఈ కేసులో ఆ అధికారిని కాపాడేందుకు కడప వైసీపీ నేత గత ప్రభుత్వంలో శతవిధాలా ప్రయత్నాలు చేశారు.
వైసీపీ నేతలతో కుమ్మక్కు
విజయనగరం, విశాఖపట్నం, కడప, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాల పరిధిలో గతంలో తహసీల్దార్లుగా పని చేసినవారు కొందరు (ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు) విలువైన భూములను వైసీపీ నేతలు స్వాహా చేసేలా మంత్రాంగం నడిపారు. ఇలాంటి వారికి సంబంధించిన అక్రమాల చిట్టాను సిద్ధం చేశారు. ఆర్‌డీవోలుగా పనిచేస్తూ వైసీపీ నేతలతో కుమ్మక్కై విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చే యించిన అధికారులు మరికొందరు ఉన్నారు. ఇప్పటికే వీరందరి అక్రమాల చిట్టాను సిద్ధం చేశారు. రికార్డుల పున:పరిశీలన పూర్తి కాగానే ఫిర్యాదులు, అభియోగాలున్న వారిపై విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భూముల సర్వే అనంతరం రూపొందించిన రికార్డుల తయారీలోనూ భారీ గోల్‌మాల్ జరిగింది. ఇందులోనూ అధికారుల పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా 50 మంది సర్వేయర్లపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. భూముల విస్తీర్ణం, సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్లను నిర్ధారించడం, వాటిని రికార్డుల్లో నమోదు చేసే విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేశారని, కొందరు డబ్బులు డిమాండ్ చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. మరో 18 మందిపై భూముల కొలతలకు డబ్బు డిమాండ్ చే శారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
రీ సర్వే పేరిట భూమంతర్
రాష్ట్రంలో 2019కు ముందు అనేక భూ వివాదాలు ఉన్నాయి. అవి న్యాయస్థానాల్లో, రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కరించగలిగినవి. 2019లో జగన్ భూముల సర్వే మొదలు పెట్టిన తర్వాత వచ్చిన భూ వివాదాలు, సమస్యలు రైతులను కల్లోలానికి గురిచేశాయి. అంతవరకు రైతులకు లేని భూ సమస్యలను బలవంతంగా రుద్దారు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం భూములు సర్వే చేయాలి. రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో కొలతలు వేయాలి. కానీ జగన్, ఆయన అనుంగ అధికారులు చేసిన హడావుడితో నిబంధనలను బేఖాతర్ చేశారు. అత్యధిక చోట్ల ఆఫీసుల్లో కూర్చొనే సర్వేలు చేసినట్లుగా రికార్డులు రూపొందించారు. దీంతో పాటు విలువైన ప్రైవేటు, ప్రభుత్వ భూములపై కన్నేసిన నేతలు అధికారులను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా రికార్డులను మార్చుకున్నారు. తమకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వారి భూములు, ఇంకా నోరులేని పేదల భూములను తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. ఇలా ఈ ఒక్క అంశంపైనే దాదాపు రెండున్నర లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటుగా చూపిస్తూ రికార్డులను తారుమారు చేశారు. ఈ కోణంలో 65 వేల ఫిర్యాదులు అందాయి. నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భూముల సర్వేను శాసించారు. కొన్నిచోట్ల విదేశాల్లో స్థిరపడ్డ వారి భూముల రికార్డులను కూడా తారుమారు చేయించారు. దీంతో బాధితులు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతల చుట్టూ తిరిగి డబ్బులు ముట్టచెప్పి సెటిల్‌మెంట్ చేసుకున్నారు. రీ సర్వే అనంతరం 38 రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రైవేటు భూముల రికార్డులు తారుమారు అయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. వీటిని నాటి తహసీల్దార్లు, ఆర్‌డీవోలు బుట్టదాఖలు చేశారు. కొలతలు వేయడం, అనంతరం భూముల స్కెచ్‌లు రూపొందించడంలో సర్వేయర్లు, తహసీల్దార్లు ప్రైవేటు పార్టీలతో కుమ్మక్కయ్యారన్న ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు అందాయి.
అడ్డగోలుగా భూములు స్వాహా
అసైన్డ్, షరతుగల పట్టా, ఇనామ్, గ్రామకంఠం భూములపై నాడు వైసీపీ నేతలు కన్నేశారు. వాటిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలతో మంత్రాంగం నడిపించారు. అప్పటి వరకు ఉన్న సెటిల్‌మెంట్ నిబంధనలను సులభతరం చేయించారు. సులభతర పరిష్కారం పేరిట మార్గదర్శకాలు జారీ చేయించారు. ఆ తర్వాత తహసీల్దార్, ఆర్‌డీవోలతో కుమ్మక్కై విలువైన అసైన్డ్, ఇనామ్, గ్రామకంఠం, చుక్కల భూములను వైసీపీ నేతలు హస్తగతం చేసుకున్నారు. ఈ వ్యవహారాల్లో తహసీల్దార్, ఆర్‌డీవోలు కీలకపాత్ర పోషించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సులభతరం పేరిట ఇచ్చిన మార్గదర్శకాలే విలువైన భూములు చేజారడానికి కారణం అయ్యాయని పేర్కొంది. ఇలాంటి మార్గదర్శకాలను అడ్డం పెట్టుకొని కొందరు ఆర్‌డీవోలు, తహసీల్దార్లు ఖరీదైన చుక్కల భూములు, గ్రామకంఠం భూములను వైసీపీ నేతలకు దోచిపెట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాల్లో వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని ప్రభుత్వం గుర్తించింది.
జగన్ బంధువులకు లబ్ధి
ఉమ్మడి కడప జిల్లాలో నాటి ముఖ్యమంత్రి జగన్ బంధువులు, అస్మదీయుల నియంత్రణ లో ఉన్న చుక్కల భూముల దరఖాస్తులను నాటి కడప ఆర్‌డీవో, తహసీల్దార్ సెటిల్ చేశారు. ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా జరిగింది. భూ వినియోగ మార్పిడి చేయకుండా నేరుగా లే అవుట్‌లు వేసి భూములను విక్రయించేశారు. దీనిపై ప్రజాందోళనలు పెల్లుబికినా నాటి ప్రభుత్వం తొక్కిపెట్టింది.
తీవ్ర ఆరోపణలు
వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు సహకరించినట్టు 18 మంది డిప్యూటీ కలెక్టర్లు, 46 మంది తహసీల్దార్లు, 68 మంది సర్వేయర్లపై ఫిర్యాదులు
ఓ డిప్యూటీ కలెక్టర్ గతంలో విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్‌గా పనిచేసినపుడు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల కబ్జా
వైసీపీ నేతలు అధికారులను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా రికార్డులను మార్చుకోవడం, ఇతర భూములను రికార్డుల్లో ఎక్కించుకున్నట్టుగా 2.50 లక్షల ఫిర్యాదులు వచ్చాయి
విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటుగా చూపిస్తూ అధికారులు రికార్డులను తారుమారు చేసినట్టు 65 వేల ఫిర్యాదులు అందాయి
రీ సర్వే అనంతరం 38 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రభుత్వ భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రైవేటు భూముల రికార్డులు తారుమారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ వార్నింగ్
Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?
Read Latest AP News And Telugu News