Share News

Metrological Department : విశాఖలో ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:44 AM

విశాఖపట్నంలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Metrological Department : విశాఖలో ఈదురుగాలుల బీభత్సం

విశాఖపట్నం/అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఒక్కసారిగా పెనుగాలులు వీయడంతో ఆరుబయట ఉన్న వారంతా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈదురుగాలులతో వర్షం కూడా కురిసింది. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు విశాఖ పరిసరాల్లో రెండు వేలకుపైగా మెరుపులు సంభవించినట్టు భారత భూవిజ్ఞాన మంత్రిత్వశాఖకు చెందిన ‘దామిని’ యాప్‌లో నమోదైంది. ఉత్తరకోస్తాలో అనేకచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

ముగిసిన ఎల్‌నినో

గత ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రచండమైన వేడి వాతావరణం, వడగాడ్పులకు కారణమైన ఎల్‌నినో కథ ముగిసింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో లానినా ఏర్పడనున్నది. పసిఫిక్‌ మహాసముద్రంలో మరికొన్ని రోజులు తటస్థ పరిస్థితులు కొనసాగుతాయని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం ప్రకటించింది. గత ఏడాది ఏర్పడిన ఎల్‌నినో తీవ్రతకు మునుపెన్నడూ లేనంతగా ప్రతినెలా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక దేశాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొనడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూపర్‌ ఎల్‌నినోగా మారడంతో అత్యంత దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మార్చి నెల తరువాత ఎల్‌నినో అనూహ్యంగా బలహీనపడడం ప్రారంభమైంది. మే నాటికి పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడేందుకు అనుకూలమైన వాతావరణం నెలకొంది. జూన్‌ నెల రెండో వారం వచ్చేసరికి ఎల్‌నినో ముగిసింది. ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే ఎక్కువగా వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ముందుగానే వెల్లడించింది.


అంచనా వేసినట్టుగానే మార్చి ఒకటో తేదీ నుంచి జూన్‌ తొమ్మిదో తేదీ వరకు దేశంలో రికార్డు స్థాయిలో వడగాడ్పులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంతగా వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు కొనసాగడంతో దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోయారు. ఒడిసాలో అత్యధికంగా 27 రోజులు, పశ్చిమ రాజస్థాన్‌లో 23 రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచాయి. దేశంలో 36 వాతావరణ సబ్‌ డివిజన్‌లలో 14 సబ్‌ డివిజన్‌లలో 15 రోజులు, అంతకంటే ఎక్కువగా వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీయడం ఇదే తొలిసారని నిపుణులు వెల్లడించారు. వేసవి విడిది కేంద్రాలైన హిమాచల్‌ప్రదేశ్‌లో 12, జమ్మూకశ్మీర్‌లో 6 రోజుల పాటు వడగాడ్పులు వీచాయి. ఈ నెల 18వ తేదీ వరకు ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లలో వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్‌, ఢిల్లీల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో ముగిసినా, దాని ప్రభావంతో దేశంలో మరికొన్ని రోజులు వేడి వాతావరణం కొనసాగుతుందని వివరించారు.

రానున్న ఐదు రోజులు వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. శనివారం ఉదయం నుంచి కోస్తాలో తీవ్రమైన ఎండ, ఉక్కపోత కొనసాగాయి. బాపట్ల, తునిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జూన్‌ నెలలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడం అరుదుగా జరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Updated Date - Jun 16 , 2024 | 07:18 AM