Share News

Minister Dola : పింఛన్లు రెడీ

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:08 AM

పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు టీడీపీ కూటమి సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. పలు పథకాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను అధికారులతో సమీక్షిస్తూనే...

 Minister Dola : పింఛన్లు రెడీ

జూలైలో ఒక్కో పెన్షనర్‌కు 7 వేలు

నిధులు సమీకరించే పనిలో సర్కార్‌

ఇప్పటికే 5 వేల కోట్లకు ఇండెంట్‌

ప్రతినెలా 1వ తేదీనే పింఛన్లు: మంత్రి డోలా

అమరావతి (ఆంధ్రజ్యోతి), పొన్నలూరు (కొండపి), జూన్‌ 28: పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు టీడీపీ కూటమి సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. పలు పథకాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను అధికారులతో సమీక్షిస్తూనే... మరోవైపు వచ్చే నెల 1న ఇవ్వాల్సిన పెన్షన్లు, ఉద్యోగుల జీతాల కోసం నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటోంది. సామాజిక పెన్షన్ల కోసం గతంలో కంటే ఎక్కువ మొత్తంలో నిధులు సమీకరించుకోవాల్సి ఉంది. నెలకు రూ.1000 అదనంగా ఇవ్వడంతో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బకాయి రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7 వేల చొప్పున చెల్లించాలి.

ఇప్పటికే ఆర్‌బీఐ వద్దకు అప్పునకు వెళ్లిన సర్కార్‌ రూ.5 వేల కోట్లకు ఇండెంట్‌ పెట్టింది. మంగళవారం వేలం ద్వారా ఈ నిధులు వస్తాయి. సామాజిక పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒకటో తేదీన చెల్లించి ఉద్యోగుల్లో సైతం భద్రతాభావం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా పింఛన్లను ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దనే ఇచ్చి చూపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా పొన్నలూరులో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకుని లబ్ధిదారులకు 1వ తేదీనే అందేలా చూడాలని కోరారు. ఎస్సీలకు ఉపాధి కల్పన కోసం త్వరలో పెద్దఎత్తున సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పొలాలున్న ఎస్సీ రైతులకు ఫార్మింగ్‌ మెకనైజేషన్‌ ద్వారా వివిధ యంత్ర పరికరాలు సబ్సిడీపై అందజేస్తామన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 04:09 AM