Share News

Minister N. Manohar : ధాన్యం కొనుగోలులో దళారులొద్దు

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:40 AM

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్నివిధాలుగా అండగా నిలవాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు.

Minister N. Manohar : ధాన్యం కొనుగోలులో  దళారులొద్దు

  • రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా

  • దీపం-2పై మరింత ఫోకస్‌: మంత్రి నాదెండ్ల

విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్నివిధాలుగా అండగా నిలవాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జాయింట్‌ కలెక్టర్లు, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, విజిలెన్స్‌, వ్యవసాయ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలన్నారు. కొనుగోలు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలని, బుకింగ్‌ నుంచి కొనుగోలు ముగిసేంత వరకూ ప్రతి విషయం రైతులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు పూర్తయిన 24 గంటల నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాలకు నగదు జమ అవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటివరకూ 1.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ప్రజలకు చేరాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయని, అటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచాలని మంత్రి మనోహర్‌ ఆదేశించారు.

పోలీస్‌, రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, విజిలెన్స్‌ అధికారులతో కూడిన బృందాలు తనిఖీలు చేయాలని సూచించారు. అక్రమంగా రేషన్‌ బియ్యం రవాణా చేసిన వారిపై 6-ఎ కేసులతోపాటు పీడీ యాక్టు ప్రయోగించాలని ఆదేశించారు. దీపం-2 పథకంపై అధికారులు మరింత ఫోకస్‌ పెట్టాలన్నారు. గ్యాస్‌ బుకింగ్‌, డెలివరీ ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలన్నారు. గ్యాస్‌ డెలివరీకి గానీ, ఈకేవైసీ చేసేటప్పుడు గానీ ప్రజల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని, అలాంటి చర్యలకు పాల్పడిన గ్యాస్‌ ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని మంత్రి ఆదేశించారు.


  • 10.59 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ధాన్యం కొనుగోలుపై అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ విశాఖ కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకూ 1.51లక్షల మంది రైతుల నుంచి 10.59లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు సీఎంకు వివరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ రూ.2,331 కోట్లు రైతులకు చెల్లించామని, అందులో రూ.2,202 కోట్లు 24 గంటల్లో, మిగిలిన మొత్తం 48గంటల వ్యవధిలో జమ చేశామని తెలిపారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌, పౌర సరఫరాల సంస్థ ఎండీ మంజిల్‌జిలాని, ఉమ్మడి ఉత్తరాం ధ్ర జిల్లాల జేసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 04:40 AM