NRI: ఎన్నారైలకు కొత్త అర్థం చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Nov 01 , 2024 | 10:52 AM
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. అక్కడి తెలుగు ఎన్నారైలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారని అభినందించారు.
అట్లాంటా: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. అక్కడి తెలుగు ఎన్నారైలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారని అభినందించారు. కొందరు ఏడాదిపాటు ఏపీలోనే ఉండి సేవలందించారని మెచ్చుకున్నారు. ఎన్నికల్లో 175కి 175 అన్నవారి ముఖాలు మాడిమసైపోయాయని, ఈ గెలుపు ప్రపంచంలో ఉన్న తెలువారందరిది అని లోకేశ్ అన్నారు. ఈ మేరకు అమెరికాలో గురువారం మాట్లాడారు.
ఎన్నారైలకు కొత్త అర్థం..
ఎన్నారైలు అంటే ఎంతో నమ్మకమైన భారతీయులు అని మంత్రి నారా లోకేశ్ కొత్త అర్థం చెప్పారు. ‘‘ అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అని అంటారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎంఆర్ఐలు అనే అనుకుంటా. కానీ ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానాఝ?. అమలాపురంలో ఉన్నానా? అనే డౌట్ వస్తోంది. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తారు. అమెరికాలో ఉన్నా మీ మనసంతా రాష్ట్రం వైపే ఉంటుంది. రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు. అందుకే మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సంపాదించిన రూపాయిలో 10 పైసలు సొంతగడ్డకు ఖర్చు పెడుతున్నారు’’ అని కొనియాడారు.
కుమ్మింగ్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు..
అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించాను. ఈ సందర్భంగా హెలికాప్టర్ పైనుంచి మంత్రి మీద పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోంది. గత ప్రభుత్వంలో చేయని తప్పునకు బాబుగారిని జైలులో బంధించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా ఎన్ఆర్ఐలతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత బలాన్నిచ్చింది’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
రెడ్‌బుక్‌లో రెండో అధ్యాయం మొదలు...
ఇక వారం రోజుల అమెరికా పర్యటనలో రాష్ట్రాన్ని ప్రమోట్ చెయ్యడానికి అవిశ్రాంతంగా ఇన్వెస్టర్స్‌ని కలిశానని లోకేశ్ చెప్పారు. ‘‘ నిర్విరామంగా ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరిపాను. కానీ ఈ రోజు మిమ్మల్ని చూసిన తరువాత నాకు కిక్ వచ్చింది.ఎన్ఆర్ఐలు కూడా సైకో జగన్ బాధితులే. రెడ్ బుక్‌లో ఒక చాప్టర్ అయిపోయింది. రెండోది ఓపెన్ అయింది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా. అతి పెద్ద వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. మా దృష్టికి తెస్తే సరిచేసుకుంటాం. మీకు ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తా. తెలుగువారు ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదగాలన్నది బాబుగారి ఆశయం. ఎన్ఆర్ఐలు ఏపీలో పెట్టుబడి పెట్టండి, మీకు అండగా నిలిచే బాధ్యత నాది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తాం’’ అని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఇటివంటి రాజకీయాలు అవసరమా అని బ్రహ్మణి ప్రశ్నించింది..
‘‘గత ప్రభుత్వంలో చేయని తప్పుకు బాబు గారిని జైలులో బంధించారు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారంతా ఎన్ఆర్ఐలతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత బలాన్నిచ్చింది. ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా అని బ్రాహ్మణి ప్రశ్నించింది. కానీ హైదరాబాద్‌లో గ్రాటిట్యూడ్ సభకు 45 వేల మంది హాజరు కావడం చూశాక.. బ్రాహ్మణి మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. ప్రజలు ఇచ్చిన మద్ధతుతో సైకోతో పోరాడేందుకు మాకు కొండంత బలాన్నిచ్చింది’’ అని లోకేశ్ అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకే సొంతం అని అన్నారు.
నేను కూడా జగన్ ప్రభుత్వ బాధితుడినే..
‘‘నేను కూడా గత ప్రభుత్వంలో బాధితుడ్నే. నేను యువగళం పాదయాత్ర చేస్తుంటే జీవో తెచ్చి అడ్డుకోవాలని చూశారు. ఆ జీవోను మడతపెట్టి జేబులో పెట్టుకోమని చెప్పాను. పాదయాత్రలో మాట్లాడుతుంటే నా స్టూల్, మైక్ లాగేశారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నాకు అండగా నిలచింది టీడీపీ కార్యకర్తలు. ఆ రోజే రెడ్ బుక్ గురించి చెప్పా. ఇప్పుడు జగన్ గుడ్ బుక్ తెరుస్తాడంట, నోట్ బుక్ చదవడమే రాదు, గుడ్ బుక్‌లో ఏం రాస్తారు? గత ఐదేళ్ల అరాచక పాలనలో పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రెడ్ బుక్ ఒక్కటే కాదు, ఇప్పుడు పెట్టుబడులు తెచ్చే బాధ్యత కూడా నాపై ఉంది’’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.