జగన్ నిర్వాకంతోనే టిడ్కో ఇళ్లు నాశనం
ABN , Publish Date - Nov 17 , 2024 | 05:05 AM
రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లు మాజీ సీఎం జగన్ పిచ్చిచేష్టలతో సర్వనాశమయ్యాయని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్వజమెత్తారు.
కక్షగట్టి లబ్ధిదారులను మార్చేశారు
పాలన అనుమతి లేకుండా వైసీపీ రంగులు
5 లక్షల ఇళ్లలో 2.38 లక్షలు రద్దు
52 వేల ఇళ్లను అర్ధంతరంగా నిలిపేశారు
కక్షగట్టి లబ్ధిదారులను మార్చేశారు
5 లక్షల ఇళ్లలో 2.38 లక్షలు రద్దు
52 వేల ఇళ్లను అర్ధంతరంగా నిలిపేశారు
కాంట్రాక్టర్లకు 540 కోట్ల బిల్లులు పెండింగ్
అక్రమాలన్నింటిపైనా విచారణ చేస్తున్నాం
అసంపూర్తి ఇళ్లకు రూ.5200 కోట్లు కావాలి
రుణం తీసుకుని ఆ ఇళ్లన్నీ పూర్తి చేస్తాం
అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లు మాజీ సీఎం జగన్ పిచ్చిచేష్టలతో సర్వనాశమయ్యాయని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్వజమెత్తారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులను కక్ష గట్టి మరీ మార్చేశారని మండిపడ్డారు. లబ్ధిదారులు మీద రుణాలు తీసుకుని వాడేసుకున్న గత వైసీపీ ప్రభుత్వం అడ్వాన్సులుగా కట్టిన డీడీలను కూడా బ్యాంకుల్లో ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిందని చెప్పారు. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వేసిన మంచి రంగులను చెరిపేసి.. వైసీపీ రంగులు వేయించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభు త్వం అక్రమాలన్నింటిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పారు. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టర్ల సమస్యపై కమిటీ వేస్తామని, ఆ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శనివారం శాసనసభలో టిడ్కో ఇళ్లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానాలిస్తూ.. టిడ్కో ఇళ్ల వ్యవహారంలో ఇప్పటివరకు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు సభకు వివరించారు.
కక్షసాధింపు ధోరణితో నాశనం..
‘‘గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్ పూర్తిగా నాశనం చేశాడు. 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని 2014-19 మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారు. అప్పుడు పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిగా కేంద్రంలో వెంకయ్యనాయుడు ఉన్నారు. ఆయనతో కలిసి పలుమార్లు చర్చలు జరిపి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా 7,01,481 టిడ్కో ఇళ్లు ఏపీకి మంజూరు చేయించాం. వీటిలో తొలుత 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చాం. 4,54,704 ఇళ్ల నిర్మాణానికి 2017 జూలైలో టెండర్లు పిలిచి వెంటనే ఆ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారే సమయానికి అంటే 2019, మే నాటికి 77,371 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. అయితే తర్వాత వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పేదల కోసం కట్టిన ఇళ్లను సర్వనాశనం చేసేసింది. టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల ఇళ్లలో 2,38,368 ఇళ్లను రద్దు చేసేసింది. 2,62,640 ఇళ్లను మాత్రమే ఉంచారు. వాటిలో కేవలం 57 వేల ఇళ్లను మాత్రమే మౌలిక సదుపాయాలతో గత ఐదేళ్లలో పూర్తి చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం వరకు పూర్తి చేసిన మరో 1.10 లక్షల ఇళ్లను పూర్తి చేసినట్లు చెబుతున్నా.. అవి పేరుకు మాత్రమే. ఇక మిగిలిన ఇళ్లన్నీ అలాగే వదిలేశారు.
ఇష్టానుసారం మార్చేశారు
టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు ఎంపిక చేసిన లబిఽ్ధదారుల్లో చాలామందిని జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం మార్చేసింది. 25 శాతం కంటే తక్కువ పనులు పూర్తయిన ఇళ్లను పూర్తిగా నిలిపివేశారు. ఇలా 52 వేల ఇళ్లను అర్ధంతరంగా నిలిపివేయడం వల్ల రూ. 339 కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 540 కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టేశారు. కరోనా సమయంలో మొబిలైజేషన్ అడ్వాన్సులపై వీవరింగ్ రూ. 110 కోట్లు పెండింగ్ ఉంది. డీవియేషన్ ఆఫ్ ఐటమ్స్ కింద రూ. 1,225 కోట్లు పెండింగ్ ఉంది. ప్రైస్ అడ్జె్‌స్టమెంట్ రూ. 189 కోట్లు పెండింగ్ ఉంది. ఈ విధంగా టిడ్కో ఇళ్లను అన్ని విధాలుగా నాశనం చేశారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇళ్లపై వైసీపీ రంగులు మార్చడానికి ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వలేదు. టెండర్లు పిలవలేదు. కేవలం నోటి మాటతో రూ. 300 కోట్లతో రంగులు మార్చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. నిర్మాణం పూర్తికాకుండానే 40,571 టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో జగన్ ప్రభుత్వం రుణాలు తీసుకుంది. ఇప్పుడు ఆ లోన్లు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారి అకౌంట్లు ఎన్‌పీఏలోకి వెళ్లిపోయాయి. దీనిపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. తిక్క పనులు చేయడం వల్లే జగన్‌ను అందరూ పిచ్చితుగ్లక్ అంటున్నారు.
టిడ్కో ఇళ్లను క్వాలిటీగా కట్టించాం
ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో ఇళ్ల ఫైల్ నా దగ్గరకు పంపుతూ.. ప్రతి మహిళ తన భర్త, పిల్లలతో ఆనందంగా జీవించేలా ఇళ్లు కట్టించమని, ఎంత ఖర్చయిన ఫర్వాలేదని చెప్పారు. ముఖ్యమంత్రి నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మంచి నాణ్యతతో ఇళ్లు కట్టించాం. 365 చదరపు అడుగుల ఇళ్లకు అడ్వాన్సుగా రూ. 50 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ. లక్ష చొప్పున లబ్ధిదారులు ముందుగానే చెల్లించాలని నిర్ణయించగా.. లబ్ధిదారులు ఆనందంగా ముందుకు వచ్చారు. కానీ జగన్ చేసిన దుర్మార్గ పనుల వల్ల లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు ఇవ్వలేదు. అడ్వాన్సు తిరిగి చెల్లించకుండా నిండా ముంచేశారు. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో ఆర్థిక కార్యకలాపాల కాంప్లెక్స్ కోసం 5 నుంచి 10 ఎకరాలు కేటాయించాం. వాటిని కూడా లేకుండా చేశారు.