Nadendla Manohar : మోసం చేస్తే సహించం
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:46 AM
రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
రేషన్ తూనికల్లో మోసాలపై
కఠిన చర్యలు: నాదెండ్ల
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పభుత్వం చెల్లించే కనీస మద్దతు ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ముందుకు వచ్చే రైతులకు మేలు చేయడంతోపాటు రేషన్ సరుకులు, బహిరంగ మార్కెట్లో సరుకులు, వస్తువుల తూకాల్లో తేడాల్లేకుండా వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల తూకాల్లో తేడాలను గుర్తించిన మంత్రి మనోహర్ మంగళవారం విజయవాడలోని సివిల్ సప్లయిస్ ప్రధాన కార్యాలయంలో తూనికలు, కొలతలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీలో మోసాలకు తావు లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, తూనికలు, కొలతలశాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.