ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ రాష్ట్రంలో తయారవ్వాల్సిందే!
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:22 AM
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించేలా ప్రపంచంలోనే విభిన్నమైన పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
విభిన్నమైన పాలసీ తీసుకురావాలి
వచ్చే కేబినెట్ ముందు పెట్టండి: సీఎం
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించేలా ప్రపంచంలోనే విభిన్నమైన పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ పరికరాల ముడి సరుకులన్నీ రాష్ట్రంలోనే లభ్యమవుతున్నాయని..
ఇవి చైనా, జపాన్ సహా ఇతర దేశాలకు వెళ్తున్నాయని.. అక్కడ ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులు తయారవుతున్నాయని.. తిరిగి వాటిని మనకే అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. అలా కాకుండా ఎలకా్ట్రనిక్ రంగంలో తయారీ నుంచి వినియోగం దాకా ‘ఎండ్ టు ఎండ్’ పాలసీని రూపొందించాలని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో ఇంధన రంగంపై ఆయన సమీక్ష జరిపారు.
ఈ భేటీలో అధికారులిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను పరిశీలిస్తూనే.. ఇంధన రంగంలో తీసుకురావలసిన చర్యలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తేవాలని.. చార్జింగ్ పాయింట్ల ద్వారా వినియోగించే విద్యుత్ అందుబాటు ధరల్లో ఉండేలా విధానం రూపొందించాలని సూచించారు.
ఈ నెల 28న జరిగే కేబినెట్ భేటీలో రాష్ట్ర సోలార్, ఈవీ పాలసీలను తీసుకురావాలని స్పష్టం చేశారు. బ్యాటరీ తయారీ పరికరాల ముడిసరుకు రాష్ట్రంలోనే లభ్యమవుతున్నా.. తయారీ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు కావడం లేదని.. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బయట నుంచి ఎలకా్ట్రనిక్ వాహనాలు, పరికరాలు కొనుగోలు చేసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లపై హైబ్రిడ్ విధానంలోనే ముందుకు వెళ్దామని చెప్పారు.
విడివిడిగా ఈ ప్లాంట్లకు అనుమతులివ్వడం వల్ల 24 గంటలూ కరెంటు అందుబాటులో ఉంటుందన్నారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉందని.. దానిని సౌర విద్యుత్‌కు ఉపయోగించుకుందామని చెప్పారు. వేస్ట్‌ల్యాండ్‌లో బయో ఇంధనం తయారీకి ప్రాధాన్యం ఇద్దామన్నారు.
రిలయన్స్ సంస్థ గడ్డి నుంచి ఇంధనం తయారు చేసే విధానం అమలుకు సిద్ధమైందని.. ఆ తరహా ఆలోచనల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్‌కో ఎండీ చక్రధరబాబు, ట్రాన్స్‌కో జేఎండీ కృతి, ఇంధనశాఖ సహాయ కార్యదర్శి కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.