Share News

Nara Lokesh : రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:10 AM

రాష్ట్రంలో తమ సేవలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు వేస్తున్నట్లుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Nara Lokesh : రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ

  • మంత్రి లోకేశ్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

  • రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ

  • మరో 15 వేల ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ

  • మంత్రి నారా లోకేశ్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తమ సేవలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు వేస్తున్నట్లుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం లోకేశ్‌తో హెచ్‌సీఎల్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమంతి శివశంకర్‌, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివప్రసాద్‌ సమావేశమయ్యారు.

రాష్ట్రంలో తమ సంస్థ విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని వారు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చైర్మన్‌ శివనాడర్‌ను కలసి ఒప్పించానని, ఇందుకు ఆయన అంగీకరించి గన్నవరంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో 4,500 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు.

తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా 20,000 మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4,500 మందితోనే ఆగిపోయిందని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.

హెచ్‌సీఎల్‌ విస్తరణకు అవసరమైన అనుమతులు, రాయితీలు అందజేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 05:29 AM