Nara Lokesh: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్
ABN , Publish Date - Nov 14 , 2024 | 02:20 PM
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పారిపోయారంటూ మంత్రి డోలా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గురువారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పారిపోయారంటూ మంత్రి డోలా ఎద్దేవా చేశారు. మంత్రి డోలా వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 19 మధ్య నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పారిపోలేదా? అంటూ టీడీపీ సభ్యులను వైసీపీ సభ్యులు నిలదీశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు.
గత ప్రభుత్వంపై చంద్రబాబు రెండేళ్లు సభలో ఉండి పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన తల్లిని అవమానించడంతోనే సభను నుంచి ఆయన చాలెంజ్ చేసి వెళ్లిపోయారన్నారు. అయినా చంద్రబాబు అసెంబ్లీకి రాకున్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. తల్లిని అవమానించిన వారిని తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి టికెట్లు ఇస్తే.. ప్రోత్సహించినట్లు కాదా? అని బొత్స సత్యనారాయణను ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు.
మండలి చైర్మన్ ఎదుట వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన..
తమ ఎమ్మెల్సీ పదవులకు రెండు నెలల క్రితమే రాజీనామా చేసినా.. మండలి చైర్మన్ వాటిని ఆమోదించడం లేదని వైసీపీ నేతలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీతలు ఆరోపించారు. ఆ క్రమంలో మండలి చైర్మన్ ఎదుట వారు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఈ సందర్భంగా చైర్మన్‌ను వారు డిమాండ్ చేశారు. ఈ రాజీనామాలు తన పరిశీలనలోనే ఉన్నాయని మండలి చైర్మన్.. ఈ సందర్బంగా వారికి సమాధానం ఇచ్చారు.
For AndhraPradesh News And Telugu News