Jagan's Regime: అరకొర వసతులు అద్దె భవనాలు
ABN , Publish Date - Dec 02 , 2024 | 02:50 AM
దుకాణ సముదాయాలు, కళాశాలలు.. చివరకు సెల్లార్లు, అపార్టుమెంట్లలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు! కొన్ని చోట్ల అయితే మరీ ఇరుకు గదుల్లో విధుల నిర్వహణ. కనీస వసతుల్లేవు. ఇలా... ఎన్నెన్నో సమస్యలు.
కొత్త జిల్లా కేంద్రాల్లో ఇంకా బాలారిష్టాలే
అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్
కనీస సౌకర్యాలూ సమకూర్చని వైనం
అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
నిర్మాణానికి భూసేకరణా చేయలేదు
నిధులు ఇస్తామని మొండిచేయి
చాలా చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు
ఇరుకు గదుల్లోనే విధుల నిర్వహణ
తగినంత సిబ్బందినీ కేటాయించలేదు
ఇన్‌చార్జి అధికారులతోనే పాలన
పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం లేదు. జిల్లా రిజిస్ట్రేషన్, ఆడిట్, పన్నుల శాఖ, దేవదాయ శాఖ కార్యాలయాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో పూర్తి స్థాయి కలెక్టరేట్ భవనం లేదు. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్న గత జగన్ ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వివిధ శాఖల్లో డివిజన్ స్థాయి అధికారులే జిల్లా ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్నారు. కలెక్టర్, జేసీ, డీఆర్వో మినహా మిగిలిన శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండటం లేదు.
నంద్యాలలోని బీఎ్‌సఎన్‌ఎల్ భవనంలో ఏడెనిమిది శాఖలకు కార్యాలయాలను కేటాయించారు. నిర్వహణ సరిగా లేకపోవటంతో చెత్తాచెదారం పేరుకుపోయి విషపురుగులు తిరుగుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తిరుపతి: ఎస్పీ ఆఫీసుకు మాత్రమే
తిరుపతి జిల్లాలో ఎస్పీ ఆఫీసు మినహా ఇతర శాఖలకు సొంత భవనాల్లేవు. తిరుపతి జిల్లా ఏర్పాటు కాక మునుపే ఇక్కడ అర్బన్ ఎస్పీ కార్యాలయానికి శాశ్వత భవనం అందుబాటులో ఉంది. దీన్నే వాడుకుంటున్నారు. ఇక కలెక్టరేట్ సహా దాదాపు అన్ని శాఖల కార్యాలయాలూ అద్దె భవనాలు లేక డివిజన్ కార్యాలయాల్లో సర్దుబాటు చేసుకుని నడుస్తున్నాయి. ఏ కార్యాలయ భవనానికీ స్థల సేకరణ జరగలేదు.
టీటీడీ యాత్రికుల కోసం నిర్మించిన పద్మావతీ నిలయం భవన సముదాయాన్ని అద్దె ప్రాతిపదికన కలెక్టరేట్ కోసం కేటాయించారు. ఏడాదికి రూ.1.25 కోట్ల అద్దె చెల్లించేలా టీటీడీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. కలెక్టరేట్ కోసం ఆ భవనాన్ని శాశ్వతంగా కేటాయించేలా గత ప్రభుత్వం ప్రతిపాదించగా... దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ఈ భవనంలోనే చాలా వరకూ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
దుకాణ సముదాయాలు, కళాశాలలు.. చివరకు సెల్లార్లు, అపార్టుమెంట్లలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు! కొన్ని చోట్ల అయితే మరీ ఇరుకు గదుల్లో విధుల నిర్వహణ. కనీస వసతుల్లేవు. ఇలా... ఎన్నెన్నో సమస్యలు. నాడు జగన్ ప్రభుత్వంలో జిల్లాలను అడ్డగోలుగా విభజించి ఏర్పాటు చేసిన కొత్త జిల్లా కేంద్రాలలో ఇదీ దుస్థితి. జగన్ అస్తవ్యస్త పాలనకు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా... రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలను ఇష్టానుసారం విభజించి వదిలేశారు. జిల్లా కార్యాలయాలకు కనీసం సొంత భవనాలు సమకూర్చే ప్రయత్నం కూడా చేయలేదు. కొత్త జిల్లాల కేంద్రాలలో ఒకటీ అరా తప్ప చాలా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే ఏర్పాటు చేశారు. నిర్మాణానికి కనీసం భూసేకరణ కూడా చేయలేదు. నాడు కార్యాలయాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పి మరీ జగన్ ప్రభుత్వం మాట తప్పింది. కనీస మౌలిక వసతులు కల్పించలేదు. కొన్ని చోట్ల మరుగుదొడ్లు కూడా లేవు. కార్యాలయాల నిర్వహణకు అవసరమైన నిధులూ మంజూరు చేయలేదు. దీంతో పలు కార్యాలయాల్లో అధికారులు సొంత ఖర్చుతో కుర్చీలు, బెంచీలు సమకూర్చుకోవాల్సిన దుస్థితి. జిల్లాల విభజన సమయంలో ఆయా శాఖలకు అవసరమైనంత మంది సిబ్బందిని నియమించలేదు. జిల్లా స్థాయి అధికారుల నియామకం కూడా చేపట్టలేదు. దీంతో ఇన్‌చార్జి అధికారులతో పాలన నెట్టుకొస్తున్నారు. పలు జిల్లాల కేంద్రాల్లో ఉన్నతాధికారులు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. ఇలా చెబుతూపోతే ఎన్నో సమస్యలు. జగన్ నిర్వాకం కారణంగా ఇప్పటికీ ఆ సమస్యలు వెంటాడుతున్నాయి.
ఇరుకు గదుల్లో...
అనకాపల్లి జిల్లాలో దాదాపు 35కు పైగా ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో నడుస్తున్నాయి. సొంత భవనాల్లో నిర్వహిస్తున్న కార్యాలయాలు ఐదులోపే ఉంటాయి. అనకాపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరంలో ఒక ప్రైవేటు కళాశాల భవనాన్ని లీజుకు తీసుకొని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమ శాఖ, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖల కార్యాలయాలు సెల్లార్లలో కొనసాగుతున్నాయి. జిల్లా ఖజానా కార్యాలయం ఒక దుకాణ సముదాయం మూడో అంతస్థులో ఉంది. గృహ నిర్మాణ సంస్థ పీడీ కార్యాలయం ఒక అపార్టుమెంట్‌లో ఏర్పాటు చేశారు. చాలామంది ఉద్యోగులు నేటికీ విశాఖపట్నం, అల్లూరి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
పేరుకే జిల్లా కేంద్రం
పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి, డ్వామా, డీఆర్‌డీఏ, ఉద్యాన శాఖ, ఖజానాధికారి కార్యాలయాలకు మాత్రమే ఫర్నీచర్, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించారు. ఇతర కార్యాలయాలకు ప్రభుత్వం నుంచి కనీసం బెంచీ, కుర్చీ వంటివి సైతం ఇవ్వలేదు. ఆయా శాఖల అధికారులే సమకూర్చుకున్నారు. తొలుత స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన సముదాయంలో జిల్లా సహకార సంస్థ, ఆడిట్, అగ్నిమాపక, మైనారిటీ సంక్షేమం, మైనారిటీ ఫైనాన్స్, దివ్యాంగుల సంక్షేమం, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు గదులు కేటాయించారు. తర్వాత వాటిని మినీ స్టేడియానికి మార్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కలెక్టర్, ఎస్పీ కార్యకలాపాలు మాత్రమే ప్రజలకు తెలుస్తుండగా, మిగిలిన కార్యాలయాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పాడేరు పేరుకు జిల్లా కేంద్రం అయినా డివిజన్ స్థాయి పాలన సాగుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అరకొర వసతులతోనే...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అరకొర వసతులు, చాలీచాలని సిబ్బంది, నిధుల కొరతతో పాలన సాగుతోంది. అమలాపురంలోని డీఆర్డీఏ భవన సముదాయంలో కలెక్టరేట్, జాయింట్ కలెక్టర్ చాంబర్లు, కాన్ఫరెన్సు హాళ్లు ఉన్నాయి. ఇవి మాత్రమే సర్వ హంగులతో రూపుదిద్దుకున్నాయి. అమలాపురం కేంద్రంగా పంచాయతీరాజ్, డీపీవో, డీటీవో, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కొన్ని కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో ఫర్నీచర్, ఇతర సౌకర్యాల కల్పనకు అధికారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇతర జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
అరకొర సిబ్బంది
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయలేదు. పలు శాఖలు కార్యాలయాలు అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. కీలక శాఖల్లో అవసరమైనంతమంది ఉద్యోగులు లేరు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. దీంతో ప్రజలు సరైన సేవలు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఖజానా కార్యాలయంలో ఏటీవోను రాజంపేటకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ముఖ్య ప్రణాళికా కార్యాలయ అధికారి ఐదు నెలల కిందట పదవీ విరమణ చేశారు. ఇంకా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఇద్దరే ఉద్యోగులు ఉన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఒకే గదిలో 10 సెక్షన్ల ఉద్యోగులు కూర్చోని పని చేయాల్పిన పరిస్థితి.
అద్దె భవనాల్లో...
విజయవాడ నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని మాంటిస్సోరి మహిళా కళాశాలకు మార్చారు. కలెక్టరేట్‌లో సర్వే అండ్ సెటిల్‌మెంట్, డీఆర్‌ఓ, జేసీ క్యాంపు కార్యాలయం, ప్లానింగ్ విభాగంతో పాటు ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్లు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ సింగ్ నగర్‌లో ఎక్కువగా అద్దె భవనాలలో ఏర్పాటు చేశారు.
అధికారులకు చాంబర్లే లేవు
రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పాలనా పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. కలెక్టరేట్‌కు సొంత భవ నాలు లేవు. రాజమహేంద్రవరం, వేమగిరి హైవేలో బొమ్మూరులో గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన నేక్ భవనంలో కలెక్టర్ కార్యాలయంతో పాటు జేసీ, అగ్రికల్చరల్, సర్వే, ఎలక్షన్ సెల్, డీఎస్‌ఓ, పౌర సరఫరా, సీపీఓ తదితర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మరుగుదొడ్ల సమస్య ఉంది. ఇక ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. గిరిజన యువజన పారిశ్రామిక శిక్షణ సంస్థ (డీటీసీ)ను ఖాళీ చేయించి అక్కడ కొన్ని కార్యాలయాలు పెట్టారు. కానీ ఇక్కడ గదులు సరిగ్గాలేవు. పరిశ్రమల శాఖలో జిల్లా అధికారి కూర్చోవడానికి ప్రత్యేక చాంబర్ లేదు. డ్వామా పీడీ ఆఫీసు పరిస్థితీ అంతే. సమాచార శాఖ కార్యాలయంలో డీపీఆర్‌ఓ, ఇద్దరు డీఎల్‌పీఆర్వోలు ఉన్నప్పటికీ వారు కూర్చోవడానికి చాంబర్లు లేవు. కొన్ని కార్యాలయాలలో ద్వారాలు చిన్నవి కావడంతో టేబుళ్లు కూడా పట్టని పరిస్థితి. ఎస్పీ కార్యాలయం, ఇరిగేషన్‌కు మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు నుంచే సొంత భవనాలు ఉన్నాయి. కలెక్టర్‌కు నివాస భవనం లేకపోవడంతో గతంలో సబ్ కలెక్టర్ ఉన్న భవనాన్ని కేటాయించారు. ఇక పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఎస్‌ఈ కేడర్ అధికారులు ఇప్పటికీ ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. బలహీనవర్గాల కార్పొరేషన్లు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి.
ఇన్‌చార్జిల పాలన
బాపట్ల జిల్లాలో చాలా కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. జిల్లా ఏర్పాటు సమయంలో తాత్కాలికంగా ఏపీహెచ్‌ఆర్డీఐ భవనంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. త్వరలోనే సమీకృత కలెక్టరేట్ నిర్మాణం జరుపుతామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఏపీహెచ్‌ఆర్డీఐ భవనంలో అన్ని కార్యాలయాలకు సరిపడా గదులు లేవు. దాదాపు పన్నెండు శాఖల కార్యాలయాలను ప్రైవేటు, కళాశాల భవనాల్లో నడుపుతున్నారు. వాటిలో కీలకమైన వ్యవసాయశాఖ, మైనింగ్, ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగాలు ఉన్నాయి. అనేక కీలక శాఖలకు జిల్లా స్థాయి అధికారుల నియామకం జరగలేదు. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.
స్థానికంగా ఉండని అధికారులు
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అధికశాతం ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పాతవి కావడంతో వాటిలోనే కొనసాగుతున్నాయి. సర్వశిక్ష అభియాన్, గృహ నిర్మాణ, పౌరసరఫరాలు, బీసీ కార్పొరేషన్, అటవీ, పరిశ్రమలు, దేవదాయ, మార్కెటింగ్, భూగర్భ, గనుల శాఖ తదితర కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. వ్యవసాయ ఆధారితమైన కృష్ణా జిల్లాలో కీలకమైన నీటిపారుదల శాఖ ఎస్‌ఈ పోస్టును ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే ఉంచారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడలో ఉన్న అధికారులు జిల్లాల విభజన తర్వాత కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. చుట్టం చూపుగా మచిలీపట్నం వచ్చి వెళుతున్నారు.
ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు
నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లాలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగడం లేదు. ఆఫీసుల్లో కనీస వసతులు లేక ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రైవేట్ భవనాలలో కొన్ని కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ నిర్ణయించిన అద్దె సరిపోక అధికారులు సొంతంగా చెల్లించాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, వారి నివాసాలకు వసతులు ఏర్పాటు చేశారు. ఇతర కార్యాలయాలకు కనీసం ఫర్నీచర్ కూడా సరఫరా చేయలేదు. జిల్లా అధికారుల నియామకాలు జరగలేదు. ఒక్కో అధికారి రెండు పోస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై పని భారం పెరిగింది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన శాఖల్లో ఈఈ స్థాయి అఽధికారే ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీడీలే పీడీలుగా పనిచేస్తున్నారు. చివరకు డీఎల్‌పీవోనే డీపీవోగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇంకా అవస్థలే
నంద్యాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం సహా ఇతర అన్ని శాఖల కార్యాలయాలు తాత్కాలిక, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నీచర్‌ను కూడా పూర్తిస్థాయిలో సమకూర్చలేదు. నంద్యాలలోని బీఎ్‌సఎన్‌ఎల్ భవనంలో ఏడెనిమిది శాఖలకు కార్యాలయాలను కేటాయించారు. సరైన వసతులు లేకపోవటంతో ఐసీడీఎస్ మహిళా అధికారుల అభ్యర్థన మేరకు ఆ ఒక్క శాఖ కార్యాలయాన్ని ఇటీవలే వేరే చోటుకు తరలించారు. ఆ భవనానికి వాచ్‌మన్ కూడా లేకపోవడంతో రాత్రి 7 దాటితే చాలు ఆకతాయిలు, మందుబాబులు వచ్చి చేరుతున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయం, భూగర్భ, జలవనరుల శాఖ, డ్వామా, డీఆర్‌డీఏ వంటి కార్యాలయాలకు కేటాయించిన అద్దె భవనాలు ఉద్యోగుల అవసరానికి సరిపోయే విధంగా లేవు. ఇరుకైన గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా విభజన సమయంలో ఆయా శాఖలకు తగినంత మంది సిబ్బందిని కేటాయించలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో పని ఒత్తిడి పెరిగిపోతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఏ కార్యాలయం ఎక్కడ ఉందో ఇప్పటికీ జిల్లా ప్రజలకు తెలియని పరిస్థితి.
నిర్వహణకు నిధుల లేమి?
పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ పరిపాలనా పరమైన ఇబ్బందులు ఉన్నాయి. చాలా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ కోసం నిర్మించిన భవనంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయానికి సొంత భవనం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజన యువత కోసం నిర్మించిన వైటీసీ భవనంలో నిర్వహిస్తున్నారు. చాలా వరకు అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కూడా కొరవడ్డాయి.
కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కీలక శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కు. నియామకమైన అధికారులు బదిలీలపై వెళ్లిపోవడం, కొత్తవారు జిల్లాకు రాకపోవడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టుతో పాటు పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, గిరిజన విద్యాశాఖ, మలేరియా తదితర కీలక పోస్టులకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్‌చార్జి అధికారులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారులు లేరు. మలేరియా శాఖ, డీఆర్‌డీఏ వంటి శాఖలకు సంబంధించి పోస్టులను భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం కార్యాలయాల నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయా శాఖల జిల్లా అధికారులే ఆ ఖర్చులు భరించారు.
కనీస వసతుల్లేవు
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌తో పాటు 90 శాతం ప్రభుత్వ కార్యాలయాలు వాటిలోనే ఉన్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు మినహా జిల్లా కార్యాలయాల్లో కనీస వసతుల్లేవు. ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో ఉన్నతాధికారులను నియమించకపోవడంతో ద్వితీయ శ్రేణి అధికారులు, అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. చాలా శాఖల పాలన నేటికీ అనంతపురం నుంచే కొనసాగుతోంది. జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఇతర ప్రాంతాలతో తగిన స్థాయిలో రవాణా సదుపాయం లేదు. రాత్రి 8.30 దాటిందంటే పలు ప్రధాన పట్టణాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేవు.