YSRCP: బడి స్థలంలో భవనం.. వైసీపీ అక్రమ నిర్మాణానికి నోటీసులు..
ABN , Publish Date - Jun 28 , 2024 | 10:42 AM
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం గుడి లేదు.. బడి లేదు.. చివరకు కొండన్న చింత కూడా లేదు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ ఏదో ఒక నిర్మాణం చేసేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీగ లాగింది. మొత్తానికి డొంకంతా కదలి వస్తోంది. తమ పార్టీ బిల్డింగ్‌లు అయినా సక్రమంగా కట్టారా? అంటే అదీ లేదు.
విజయవాడ: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం గుడి లేదు.. బడి లేదు.. చివరకు కొండన్న చింత కూడా లేదు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ ఏదో ఒక నిర్మాణం చేసేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీగ లాగింది. మొత్తానికి డొంకంతా కదలి వస్తోంది. తమ పార్టీ బిల్డింగ్‌లు అయినా సక్రమంగా కట్టారా? అంటే అదీ లేదు. అవి కూడా అక్రమ నిర్మాణాలే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయ నిర్మాణం జరిగిందని అంటున్నారు.
వెయ్యి చదరపు గజాలపై బడి స్థలంలో భవనం నిర్మాణం జరిగిందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటి అనుమతిని తీసుకోకుండానే వైసీపీ నేతలు కార్యాలయ నిర్మాణం జరిపినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ అనుమతులు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేరు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బందికి అధికారులు నోటీసులు అందచేశారు. వారు ఇచ్చే వివరణ ను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.