అమెరికాలో ఆంధ్రా డాక్టర్ మృతి
ABN , Publish Date - Aug 26 , 2024 | 06:15 AM
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు(64) దుర్మరణం చెందారు.
దుండగుల కాల్పుల్లో దుర్మరణం
ఆరోగ్య రంగంలో 38 ఏళ్లుగా సేవలు
టస్కలూసాలో ఓ వీధికి ఆయన పేరు
కొవిడ్ సమయంలో సేవలకు అవార్డులు
నాయుడుపేట టౌన్, ఆగస్టు 25: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు(64) దుర్మరణం చెందారు.
టస్కలూసా నగరంలోని ఆయన ఇంటి సమీపంలో ఉన్న కారు షెడ్‌వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. అమెరికాలో అనేక ఆసుపత్రులను నిర్వహించిన రమేశ్‌బాబు... క్రిమ్సన్ నెట్‌వర్క్ పేరుతో పనిచేస్తున్న స్థానిక వైద్యాధికారుల బృందానికి వ్యవస్థాపకుడు. ఈ బృందానికి మెడికల్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య రంగంలో 38 సంవత్సరాల పాటు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా టస్కలూసాలోని ఓ వీధికి ఆయన పేరు పెట్టారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన అందించిన విస్తృతమైన సేవలకు పలు అవార్డులు కూడా అందుకున్నారు. చేనేత కుటుంబానికి చెందిన పేరంశెట్టి చిన్నగురునాథం-రాజేశ్వరమ్మ దంపతుల మూడో సంతానం డాక్టర్ రమే్‌షబాబు.
మేనకూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివి, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తర్వాత అమెరికా వెళ్లి జమైకాలో పీజీ వైద్యవిద్య పూర్తిచేసి డాక్టర్ ప్రాక్టీసు పెట్టి మంచిపేరు తెచ్చుకున్నారు.
అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రీలతను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. ఇండియాలో ఉన్న తన సోదరులు, వారి పిల్లలు అమెరికాలో స్థిరపడటానికి కూడా తనవంతు సహకారం అందించారు. రమేశ్‌బాబు మృతి సమాచారంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.